బిఆర్ఎస్ అంచనా తప్పిందా ❓️
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ :
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో అధికార బీఆర్‌ఎ్‌సపై పడనుందా? సరిహద్దు ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎక్కువగా ఉండనుందా? జేడీఎస్ ఘోర వైఫల్యం బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందికరంగా మారనుందా? అంటే.. రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ కర్ణాటకతోనే ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరిపినందున.. ఆ ప్రభావం తప్పక ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడి బీఆర్‌ఎ్‌సకు కొరకరాని కొయ్యగా మారొచ్చని అంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం బీఆర్‌ఎ్‌సకు దెబ్బేనని పేర్కొంటున్నారు.
*హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్ హవా!*
కర్ణాటక ఫలితాలపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అధికార బీజేపీకి ఓటమి తప్పదని, కాంగ్రెస్ విజయం సాధించనుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నెల 10న ఎన్నికలు జరిగిన తర్వాత చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రె్‌సదే ఆధిక్యమంటూ వెల్లడించాయి. అన్నట్లుగానే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 136 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్న హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లోని 41 సీట్లలో 26 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ బొక్కబోర్లా పడింది. ఇది బీఆర్‌ఎ్‌సకు పెద్ద షాకేనని చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేశాక కేసీఆర్ తొలుత కుమారస్వామినే కలిశారు. ఆయనకు కేసీఆర్ ఆర్థిక సాయం కూడా చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్, జేడీస్ కలిసే కర్ణాటకలో పోటీ చేస్తాయన్న వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెడతారన్న ప్రచారమూ జరిగింది. కర్ణాటకలో జేడీఎస్ గెలిస్తే అక్కడ కుమారస్వామి ద్వారా చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావించారు. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీకిపూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే జేడీఎస్ ద్వారా రాజకీయాన్ని నడపవచ్చనుకున్నారు. ఒకదశలో కర్ణాటకతో పాటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనీ యోచించారు. కాంగ్రెస్ గెలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందన్న భయాందోళనలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ఇప్పుడదే జరగబోతోంది. కర్ణాటకలో, ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక (కల్యాణ కర్ణాటక) రీజియన్‌లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఈ రీజియన్‌లోని బీదర్, యాద్గిర్, రాయ్‌చూర్, గుల్బర్గా, కొప్పల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య బంధుత్వాలు ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. సరిహద్దులోని ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో, ఇటువైపు ప్రజలు కూడా కాంగ్రె్‌సకే ఓటేస్తారన్న చర్చ జరుగుతోంది. బంధువుల రాకపోకల వల్ల ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులోని సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో పాటు బాన్సువాడ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎ్‌సపై తీవ్ర ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలున్నాయి. కేసీఆర్ నమ్మి దోస్తీ చేసిన జేడీఎ్‌సను కన్నడిగులు ఘోరంగా ఓడించారు. ఇక్కడ కూడా కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి, అభిమానం ఇక్కడి ప్రజల్లో కొంత మేరకు ఉంది. ఇది కాంగ్రె్‌సకు కలిసి వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. కర్ణాటకలో గెలిచిన జోష్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ స్పీడు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.