హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సిఎం తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమౌతాయి. అదే రోజు రాష్ట్ర మంత్రులు, వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం నాడు సచివాలయంలోని సిఎం సమావేశమందిరంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు శ్రీ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, డిజీపి శ్రీ అంజనీకుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ రమణాచారి, శ్రీ అనురాగ్ శర్మ, సిఎం కార్యదర్శులు శ్రీమతి స్మితా సభర్వాల్, శ్రీ భూపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సునిల్ శర్మ, సింగరేణి కాలరీస్ సిఎండి శ్రీ శ్రీధర్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, పంచాయతిరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాసరాజు, మైనారిటి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అహ్మద్ నదీమ్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ ఎమ్. రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు శ్రీ హన్మంతరావు, మత్స్య శాఖ సంచాలకులు శ్రీ లచ్చిరామ్ బుక్యా, పశు సంవర్ధక శాఖ సంచాలకులు శ్రీ రామచందర్, విజయ డైరీ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున్, కార్యదర్శి శ్రీమతి టి.కె.శ్రీదేవి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీ శేషాద్రి, ప్రొటోకాల్ సంచాలకులు శ్రీ అరవిందర్ సింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఎఎమ్ రిజ్వీ, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జితెందర్, చేనేత శాఖ కార్యదర్శి శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సిడిఎమ్ఎ శ్రీ సత్యనారాయణ, టీఎస్ఐఐసీ సంచాలకులు ఇవి నర్సింహరెడ్థి, బిసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం కార్యదర్శి క్రిష్టినా జడ్ చోంగ్తూ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతీ హోలికేరి, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ట, శ్రీ ముషారఫ్ అలీతో పాటు ఎమ్మెల్సీ శ్రీ దేశపతి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2వ తేదీ నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సుగల రాష్ట్రం. అయినా కూడా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. నేడు తెలంగాణ దేశానికే వొక రోల్ మోడల్ గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాల్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి వొక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నం అని సిఎం కేసీఆర్ అన్నారు.
అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి వుంటుందని సిఎం తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని తెలంగాణలో అదే జరుగుతున్నదని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సిఎం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని వున్నదనడానికి తొమ్మిదేండ్ల అనతికాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని సిఎం తెలిపారు. పేరుకు తొమ్మిదేండ్లు అయినా, మొదటి సంవత్సరంతో పాటు, కరోనా కాలపు మరో రెండేండ్లు కలిపి దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని సిఎం అన్నారు.