కర్ణాటకలో బండి సంజయ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఇంత ఘోరమా..
సోషల్ మీడియాలో వైరల్..!
హ్యూమన్ రైట్స్ టుడే: కర్ణాటకలో గెలిచి దక్షిణాదిని కైవసం చేసుకోవాలనుకున్న బీజేపీ బొక్కబోర్లా పడింది..! కాంగ్రెస్‌కు ఊహించని రీతిలో 136 సీట్లు రావడంతో కమలనాథులు కంగుతిన్నారు. ఈ విజయంతో వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న ‘చేయి’కి మళ్లీ ఊపిరొచ్చి లేచినట్లయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కన్నడనాట ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ తరఫున కీలక నేతలు వెళ్లి కర్ణాటకలో ప్రచారం చేయడంతో.. ఏ మాత్రం ఓట్లు రాలాయి..? గెలిచారా..? ఓడిపోయారా..? అని తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. రెండు మూడ్రోజులు అక్కడే తిష్టవేసి మరీ ప్రచారం చేసొచ్చారు.. అయితే ఫలితాల తర్వాత అటు కర్ణాటకలో.. ఇటు తెలంగాణలో సీన్ ఎలా ఉందో ఈ కథనంలో చూసేయండి..!
ఇలా జరిగిందేంటో..!
తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్లిన బండి సంజయ్.. అక్కడ కీలక నియోజకవర్గాలైన చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాల్లో వీధివీధి తిరుగుతూ ప్రధాని మోదీ గురించి, బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. అయినప్పటికి ఈ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవకపోవడం.. అందులోనూ తెలుగు ప్రజలే ఆదరించకపోవడం గమనార్హం. అంతేకాదు కనీసం రెండోస్థానంలో కూడా నిలవకపోవడం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. కోలార్, చింతామణి, ముల్బగల్ నియోజకవర్గాల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. ఇక గౌరీబిదనూర్‌లో అయితే ఏకంగా ఐదో స్థానానికి.. బాగేపల్లి, చిక్కబల్లాపూర్‌లో అయితే బీజేపీ ఘోరం ఓటమిపాలైంది. దీంతో ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందోంది. బండి ప్రచారం చేసిన నియోజకవర్గాల జాబితాను తీసి మరీ కొందరు వైరల్ చేస్తున్నారు.
తెలంగాణలో హాట్ టాపిక్..!
కర్ణాటకను కైవసం చేసుకున్నామన్న ఆనందంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగితేలుతుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పితే పెద్దగా ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. ముఖ్యంగా తనను విమర్శిస్తే చాలు నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియాలో.. ప్రెస్‌మీట్ పెట్టేసే బండి నుంచి ఇంతవరకూ కనీస స్పందన రాకపోవడంగానీ.. పోనీ కౌంటర్‌గా కూడా మాట్లాడకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. అయినా బండి ఎక్కడికెళ్లినా విద్వేషపు ప్రసంగం, రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం ఇంకొకటి ఉండదని అందుకే.. పాపం ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఓట్లు కూడా కాంగ్రెస్‌కే పోయాయని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇదీ బండి రేంజ్ అంటే అని కొందరు.. సంజయ్ ప్రచారం చేస్తే మినిమమ్ అట్లుంటదని మరికొందరు నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయినా పక్క రాష్ట్రాల గురించి మనకెందుకు.. ముందుంది కదా రాష్ట్రంలో అసలు సిసలైన పండుగ అప్పుడు చూస్కుందామంటూ బీజేపీ కార్యకర్తలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఫైనల్‌గా బండి మీడియా ముందుకు వస్తే ఈ విమర్శలన్నింటిపైనా ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.