హ్యూమన్ రైట్స్ టుడే/డిజిటల్: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.
ఇదిలా ఉంటే ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 54 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చనిపోయిన 54 మందిలో 16 మృతదేహాలను చురచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచగా, 15 మృతదేహాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అనధికారికంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దుకాణాలు, మార్కెట్‌లు తిరిగి తెరవడం, వాహనాలు రోడ్లపైకి రావడంతో శనివారం ఇంఫాల్ లోయలో జనజీవనం జాగ్రత్తగా సాధారణ స్థితికి చేరుకుంది.
చురచంద్‌పూర్, మోరె, కక్చింగ్, కాంగ్‌పోక్పి జిల్లాలను సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. 13,000 మందిని రక్షించి సురక్షిత ఆశ్రయాలకు తరలించామని, కొంతమంది ఆర్మీ క్యాంపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. మణిపూర్ లోని మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతైకి గిరిజన హోదా కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. మైతై కమ్యూనిటీకి, కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీలకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) బుధవారం నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ సందర్భంగా చురాచంద్‌పూర్ జిల్లాలోని టోర్‌బంగ్ ప్రాంతంలో మొదట హింస చెలరేగింది. ఇది నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.
మైతై కమ్యూనిటీ ఎస్టీ హోదా డిమాండ్ పై నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు పంపాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో నాగాలు మరియు కుకీలతో సహా గిరిజనులు మార్చ్ నిర్వహించారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందిన వారు. వీరంతా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. 40 శాతం ఉన్న కుకీలు, నాగాలు, ఇతర గిరిజనులు కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటారు.