హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ : వ్యాపారం కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.171.50 చొప్పున తగ్గించాయి. ఈ తగ్గింపు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు లేదు.
పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయంతో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటెయిల్ ధర ఢిల్లీలో రూ.1,856.50కు తగ్గింది. ముంబైలో ఈ ధర రూ.1,808కి తగ్గింది. అంతకుముందు ఈ నగరంలో ఈ ధర రూ.1,980 ఉండేది. కోల్‌కతాలో దీని ధర గతంలో రూ.2,132 కాగా, తగ్గిన తర్వాత రూ.1,960.50కు చేరింది. చెన్నైలో అంతకుముందు రూ.2,192 ఉండేది, ప్రస్తుతం రూ.2,021కి తగ్గింది.
గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరతో పోల్చుకుంటే, వ్యాపార వర్గాలు వినియోగించే గ్యాస్ ధరలు తరచూ మారుతూ ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు అయిన ఏప్రిల్ 1న వ్యాపార వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.92 తగ్గింది. మార్చిలో ఈ ధర రూ.350.50 పెరిగింది. అదేవిధంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. జనవరిలో రూ.25 చొప్పున పెరిగింది.
2022లో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు నాలుగుసార్లు పెరిగాయి, మూడుసార్లు తగ్గాయి.