ఎన్నికల సంఘానికి సిద్దిపేటవాసి దరఖాస్తు..
హ్యూమన్ రైట్స్ టుడే/సిద్దిపేట: టీఆర్‌ఎస్(తెలంగాణ రాజ్య సమితి) పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది.
తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ కోసం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయం చిరునామాగా ఓల్డ్ అల్వాల్‌లోని ఇంటి నంబర్. 1-4-177/148, 149/201ను దరఖాస్తులో పేర్కొన్నారు..
కాగా, అదే గ్రామానికి చెందిన తుపాకుల మురళీకాంత్.. పార్టీ ఉపాధ్యక్షుడిగా, సదుపల్లి రాజు.. కోశాధికారిగా, వెల్కటూర్‌కు చెందిన నల్లా శ్రీకాంత్.. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మే 27లోపు తమ కు తెలపాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 28న ఓ హిందీ పత్రిక, 29న ఇంగ్లిష్ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో అభ్యంతరాలొస్తే పరిశీలిస్తారు.
అనంతరం నిబంధనల మేరకు రాజకీయ పార్టీగా రిజిస్ట్రర్ చేస్తారు. కాగా, బాలరంగం 1983 నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు. 1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్‌గా, 2001లో ఆయన సతీమణి ఎల్లమ్మ సర్పంచ్‌గా, అప్పటి టీఆర్‌ఎస్ సిద్దిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జెడ్పీటీసీగా, 2019-2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు.