లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ :
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమొరాండం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు.
ఒక పార్టీ అధ్యక్షురాలిపట్ల పోలీసుల తీరు సరిగా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లను పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమెను తోసివేసే ప్రయత్నం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తన తప్పులేకపోయినా పోలీసులు తనపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్సార్‌టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.