హ్యూమన్ రైట్స్ టుడే/జహీరాబాద్: మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో ఈరోజు నుండి గరుడ గంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో కుంభమేళా ప్రారంభించారు. ఉదయం 11 నుంచి భక్తులు మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహిస్తారు. కుంభమేళాకు ఉత్తరాధి నుంచి నాగసాధువులు, సాధుసంతులు, పీఠాధిపతులు తరలిరానున్నారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ కుంభమేళా రెండు వారాలపాటు కొనసాగనుంది. రోజూ సాయంత్రం మంజీర నదికి గంగా హారతి ఇస్తారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ శరత్ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నారు. కుంభమేళా ప్రారంభోత్సవంలో జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొంటారు. ఈ నెల 28న మంత్రి హరీశ్‌రావు కుంభమేళాకు హాజరుకానున్నారు.