వైద్యులు రోగి పట్ల నిర్లక్ష్యం వహిస్తే కన్సమర్ కోర్టులో నష్టపరిహారం కోరవచ్చు – సుప్రీం కోర్టు సంచలన తీర్పు.
హ్యూమన్ రైట్స్ టుడే: దేశంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు కూడా సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి వస్తారని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ డి.వై.చంద్ర చూడ్, జస్టిస్ హిమా కోహ్లి తమ తీర్పులో సేవలు అన్న పదానికి విస్తృతమైన నిర్వచనం ఉందని చెపుతూనే ఏ తరహా సేవలైనా వినియోగదారులు రక్షణ చట్టం పరిధిలోకి కచ్చితంగా వస్తాయని, వైద్యుడు , రోగి మధ్య ఉండే సంబంధం యజమాని సేవకుడు సంబంధం కాదని వైద్య సేవ అనేది వైద్యుడు రోగి మధ్య కుదుర్చుకున్న వ్యక్తిగత ఒప్పందం (కాంట్రాక్టు)అని, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులకి వినియోగదారుల రక్షణ చట్టం నుండి మినహాయింపు లేదని తీర్పనిచ్చింది . ఈ తీర్పు తో వైద్య రంగంలో దోపిడీకి అడ్డు కట్ట వేసినట్లయిoది.
వినియోగదారుడి పట్ల ఒక వైద్యుడి నిర్లక్ష్యం పై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా” మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్” సుప్రీంకోర్టులో పిల్ వేసింది.దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ వినియోగదారులకి అండగా ఇటీవల చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దేశంలో రోగుల పట్ల అన్యాయంగా వ్యవహరించే, అడ్డగోలు దోపిడీ చేసే వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు వినియోగదారుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పు తో ఏర్పడింది ఇది ముమ్మాటికీ వినియోగదారుల విజయం.