కవిత తప్పు చేయకపోతే సెల్‌ఫోన్‌లు ఎందుకు ధ్వంసం చేశారు..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మానసికంగా ఏ పరిస్థితిని అయినా ఎదుర్కునేందుకు సిద్దమవుతున్నట్లుగా ఉన్నారు. డిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెకు తొమ్మిదో తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం, తదుపరి ఆమె పదకుండో తేదీన హాజరు కాగలనని చెప్పగా, ఈడీ అందుకు అంగీకరించడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సహజంగానే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

జైలులో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదు.. అజ్ఞాత వాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడు.. అని కవిత సెంటిమెంటును ప్రయోగించారు. అంటే దీని అర్ధం ఒకవేళ తాను జైలుకు వెళ్లవలసి వచ్చినా, అంతిమంగా తానే గెలుపు సాధిస్తానని చెప్పడమే. పురాణాలలో ఏమి జరిగిందన్నది పక్కనబెడితే, కవిత ఎదుర్కుంటున్న కేసు విభిన్నమైనదని చెప్పాలి. ఢిల్లీలో మద్యం షాపుల కేటాయింపు వ్యవహారంలో ముడుపుల చెల్లింపు జరిగిందన్నది ఆరోపణ. వంద కోట్ల మేర ఈ ముడుపులు ఉన్నాయని, తద్వారా వ్యాపార లావాదేవీలలో నిందితులు లాభపడ్డారని ఈడీ అభియోగం మోపుతోంది.

నిజానికి ఇలాంటి కేసులలో ఒక మహిళా నేతగా ఉన్న కవిత చిక్కుకోవడం దురదృష్టకరం. ఇప్పుడు ఆమె తాను మహిళను కనుక ఇంటివద్దే విచారించాలని కోరుకోవడం తప్పుకాదు. కాని ఇప్పటికే ఒకసారి ఆమె విచారణ జరిగింది. మరోసారి జరగబోతోంది. ఈ స్కామ్‌లో అరెస్టు అయిన రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆమెను విచారిస్తున్నారు. ఆ సాక్ష్యం ప్రకారం పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ అని ఈడీ చెబుతోంది. అది నిజమా? కాదా అన్నది తేలవలసి ఉంది. కవిత కాని, ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ కాని, ఇప్పటివరకు ఈడీని ప్రతిపక్షాలపై మోదీ ప్రయోగిస్తున్నారని, ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రతిపక్షాలపై కేంద్రం ఇలాంటి దాడులు చేయిస్తోందని వారు అంటున్నారు.

ఇందులో నిజం ఉండవచ్చు. కేంద్రం అలా చేస్తే తప్పే అవుతుంది. కాని అదే సమయంలో ఈడీ వేస్తున్న ప్రశ్నలకు కవిత కాని, కేటిఆర్ కాని సమాధానాలు ఇవ్వగలిగితే బాగుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు. అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తాము ఏలుతున్న చోట అరాచకం వస్తుందని ఒక మంత్రి ఎలా చెబుతారో తెలియదు. బీఆర్ఎస్ నేతలు ఈ స్కామ్ కు సంబంధించి కవితకు అండగా ఉంటామని అంటున్నారు.

అసలు వీరెవ్వరూ కవితకు రక్షణగా నిలవవలసిన అవసరం లేదు. తెలంగాణ జాగృతి పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆమెకు ధైర్యం ఎక్కువే. ఇక్కడ సమస్య వారి అండ, వీరి అండ కాదు. ఈడీ అధికారులు అడిగే నిర్దిష్ట ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలిగితే ఈ కేసు నుంచి బయటపడడం సులువే అవుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు కవితపైన, బీఆర్ఎస్ పైన కొన్ని విమర్శలు చేస్తూ కవిత వల్ల తెలంగాణ సమాజానికి అప్రతిష్ట వచ్చిందని అన్నారు.

కవిత తప్పు చేయకపోతే సెల్‌ఫోన్‌లు ఎందుకు ధ్వంసం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే కవిత కూడా డిల్లీ హోటల్‌లో జరిగిన లిక్కర్ వ్యాపారుల సమావేశంలో పాల్గొన్నారా? లేదా? గోవా ఎన్నికలకు గాను ఆమ్ఆద్మీ పార్టీకి నిధులు వెళ్లాయా?లేదా? రామచంద్రపిళ్లై వాస్తవానికి కవిత బినామీనా?కాదా? వారితో ఈమెకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా? లేవా? హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు కాని, వ్యాపారి అభిషేక్ వంటివారు కీలకపాత్ర పోషించడం నిజమా? కాదా? ఇలాంటివాటికి జవాబులు ఇవ్వడం ద్వారా కవిత తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని రుజువు చేసుకోగలుగుతారు తప్ప, కేవలం రాజకీయ విమర్శలు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉండకపోవచ్చు.

అయితే అదే సమయంలో బీజేపీ కూడా రాజకీయంగానే కొన్ని కేసులను చూస్తోందన్న విమర్శ ఉంది. సెలెక్టివ్‌గా కొందరిపైకే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసి కొల్పుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవలే శివసేన నేద సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసి పదిహేను రోజులకు పైగా నిర్భంధించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చినప్పుడు కూడా వారు ఇవే కక్ష ఆరోపణలు చేశారు. చిత్రం ఏమిటంటే సోనియాగాందీ దేశంలో తనకు ఎదురులేని విధంగా చక్రం తిప్పినప్పుడు ప్రత్యర్ధులపై ఇలాంటి అస్త్రాలనే వాడారన్న విమర్శలను ఎదుర్కున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడిపై కేసులు వచ్చిన తీరును ప్రజలంతా కక్షపూరిత కేసులుగానే భావించారు. దానికి కారణం ఒకటే.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పడు ఎలాంటి కేసులు లేకపోవడం, ఆ తర్వాత కేసులు పెట్టడం. 2019 ఎన్నికలకు ముందు ఆనాటి విభజిత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం తనపై సీబీఐని ఉసికొల్పుతోందని, ప్రజలంతా తనకు రక్షణగోడగా నిలవాలని కోరేవారు. రాష్ట్రంలోకి సీబిఐ అడుగుపెట్టడానికి వీలులేదని ఆయన ఆంక్షలు పెట్టారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే సీబీఐ వేధింపులకు గురైన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో సీబీఐపై ఆంక్షలు తొలగించడం. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఓటమి చెందిన తర్వాత ఆయన పీఏపై ఐటి అధికారులు దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు ఆధారాలు ఉన్నాయని తేల్చినట్లు సీబీటీడీ ప్రకటించింది. నాలుగేళ్లు అవుతున్నా ఆ కేసు ఏమి అయిందో తెలియదు. చంద్రబాబు తన మేనేజ్ మెంట్ స్కిల్ తో ఆ కేసు పైకి రాకుండా చేసుకోగలిగారని చాలామంది భావిస్తుంటారు.

అదే కాదు. ఓటుకు నోటు కేసులో మనవాళ్లు బ్రీప్ డ్ మీ అంటూ వాయిస్‌తో పట్టుబడ్డప్పుడు బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేరని కేసీఆర్ అనేవారు. కాని చిత్రంగా ఆయనే రక్షణ బాధ్యత తీసుకునేలా చంద్రబాబు చేయగలిగారని ఎక్కువమంది నమ్ముతుంటారు. బహుశా దేశంలోనే ఇలా ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయగల నైపుణ్యం చంద్రబాబుకే ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. కాని ఇప్పుడు కేసీఆర్ తన కుమార్తె కవిత విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు.

ఆమెను ఈడీ నిజంగా అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది తేలడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. కాని ఇలాంటి స్కామ్ లో ఇరుకున్నారన్న అపవాదు రావడం జనంలో కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. ఒకవేళ అరెస్టు అయితే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఆయన తర్జనభర్జన పడుతున్నారు. డిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉంటూ అరెస్టు అయిన మనీష్ సిసోడియాకు మద్దతుగా కేసీఆర్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. తన కుమార్తెకు ఎదురయ్యే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే లేఖ రాసి ఉండవచ్చు.

ఈ ఏడాది ఆఖరుకు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగా ఈ పరిణామం ఇంకా ఎలా రూపాంతరం చెందుతుంది? రాజకీయంగా బిఆర్ఎస్ కు ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు దీని ఆధారంగా రాజకీయంగా ముందుకు వెళ్లి కేసీఆర్‌ను ఇరుకున పెట్టడానికి యత్నిస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత మల్లు భట్టి ఈ కేసులో ఆప్‌తో పాటు, బిఆర్ఎస్ ను కూడా విమర్శించారు.


బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో డిల్లీలో మహిళా రిజర్వేషన్ లపై జరుపుతున్న ధర్నాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గేని కవిత ఆహ్వానించడం ఆసక్తికర పరిణామం. తనకు ఎదురైన సమస్యను రాజకీయంగా ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను కలుపుకునే యత్నం చేస్తున్నట్లు అనుకోవచ్చు. కాని కాంగ్రెస్ ఇందుకు సిద్దపడితే ఆశ్చర్యపోవాల్సిందే. ఏది ఏమైనా కవిత ఇలాంటి కేసును ఎదుర్కోవలసి రావడం బాధాకరమే. దీని వల్ల పార్టీకి,ముఖ్యమంత్రికి ఎంతో కొంత అప్రతిష్టే అని చెప్పక తప్పదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment