‘కిసాన్ సమ్మాన్ నిధి’ సాయం నేడు.. రూ.16,800 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని
దిల్లీ: దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిది’ 13వ విడత కింద రూ.16,800 కోట్ల సాయాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదిలో రూ.6,000 సాయం చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. కర్ణాటకలోని బెళగావిలో లక్ష మందికి పైగా కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో నిర్వహించనున్న సభలో ప్రధాని 13వ విడత సాయాన్ని విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.