హ్యాట్రిక్‌పై అధికార బీఆర్‌ఎస్ గురి..
రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పర్యటనలు..
నేతలంతా నియోజకవర్గాల్లోనే..
అన్నిచోట్లా హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలతో కాంగ్రెస్ హల్‌చల్
ఇప్పటికే 8 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో బీజేపీ జోరు
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయముంది. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప..ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కానీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అప్పుడే ఎన్నికలు లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు, వివిధ రకాల కార్యక్రమాలతో హల్‌చల్ చేస్తున్నాయి. ఓటర్లను తమ పార్టీల వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తమ జెండా, ఎజెండాను జనంలోకి తీసుకెళ్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నాయకులు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నేతలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయిస్తుండగా, హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలతో కాంగ్రెస్ పార్టీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల పేరుతో బీజేపీ నేతల హడావుడి ఊపందుకుంది.
సంక్షేమమే బీఆర్‌ఎస్ ప్రధానాస్త్రం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే ఈసారి ఎన్నికల్లో కూడా ప్రధానాస్త్రాలుగా వినియోగించుకునే పనిలో అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బిజీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకే పరిమితం అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. సభలు, సమావేశాల్లో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు ఆదేశాలందాయి. మరోవైపు పార్టీ పరంగా సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బూత్ నుంచి జిల్లా స్థాయిలో పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేసుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.
గత ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి? ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులేంటి? ప్రజల మూడ్ ఎలా ఉంది? అన్నదానిపై సమాచారం తీసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన హామీల చిట్టాలను సిద్ధం చేస్తున్నారు. యువతను ఆకర్షించాలనే వ్యూహంతో రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ‘కేసీఆర్ కప్’పేరుతో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలెవరూ హైదరాబాద్‌కు రావాల్సిన పని లేదని, నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలతో మమేకం కావాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రానున్న రెండు నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలనే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే ఎనఎన్నికల్లో కూడా విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది.
‘హాథ్‌సే హాథ్ జోడో పైనే ఆశలు
ఎన్నికలు లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంగా ముందుకెళుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు కొనసాగింపుగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభించిన హాథ్ సే హాథ్‌జోడో యాత్రలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే జోరుగా యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీలపై విరుచుకుపడుతున్న రేవంత్.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
తాను యాత్ర నిర్వహించిన చోట్ల దాని ప్రభావం ఖచ్చితంగా ఉండేలా స్థానిక ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న పార్టీల నేతలపై చార్జిషీట్లు వేస్తున్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఐదు చార్జిషీట్లు విడుదల చేశారు. మరిన్ని చార్జిషీట్లు రూపొందించేందుకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. మరోవైపు టీపీసీసీ కీలక నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కూడా ఈ యాత్రలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఎన్నికల వరకు ఎడతెరిపి లేకుండా..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం పోరాడుతోంది. ఎన్నికల కార్యాచరణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు దీటుగా ముందుకెళుతోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రల పేరుతో ఐదు విడతల పాదయాత్రలు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో విడత యాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు కమలదళం శ్రీకారం చుట్టింది. ‘ప్రజాగోస-బీజేపీ భరోసా’పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి వల్ల కలిగే లబ్ధిని ప్రజలకు వివస్తోంది. ఈ నెల 10-28 వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శక్తి కేంద్రాల (మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌లు కలిపి) స్థాయిలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతలు ఇప్పటికే 8 వేల వరకు సమావేశాలు పూర్తి చేశారు. మిగతా సమావేశాలు కూడా పూర్తి చేయడంతో పాటు వచ్చే నెలలో మరో కార్యక్రమ నిర్వహణపై దృష్టి పెట్టారు.
బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ పేరుతో మార్చి 12 నుంచి 20 వరకు కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు ఊపందుకుంది. తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్ లాంటి నేతలు, కేంద్ర మంత్రులతో పాటు వీలున్నప్పుడల్లా అమిత్‌షా లాంటి దిగ్గజ నేతల పర్యటనలతో ఎన్నికల వరకు ఎడతెరిపి లేకుండా ప్రజల్లోనే ఉండాలనే వ్యూహంతో బీజేపీ కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ మూడు పార్టీలే కాకుండా ఎంఐఎం, వామపక్షాలు, వైఎస్సార్‌టీపీలు కూడా ప్రజలకు చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.