ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలోకి
రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ నిర్దేశం
హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. ‘‘చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య (ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అందువల్ల అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి, అమలుచేయాలి. ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ల (డైట్) ద్వారా అమల్లో పెట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్‌సీఈఆర్‌టీ పర్యవేక్షణలో నిర్వహించాలి’’ అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.