అమరావతి: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. వందలాది వాహనాల్లో కన్నా అనుచరులు నినాదాలు చేస్తూ ఆయన వెంట వచ్చారు. ముందుగా నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2.48 గంటలకు అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు వేలాదిగా తెదేపా కండువా కప్పుకున్నారు. ఈ నెల 16న కన్నా లక్ష్మీనారాయణ భాజపాకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
*తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తి కన్నా: చంద్రబాబు*
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ‘‘రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తి కన్నా. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారు. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రగతికి నాంది పలకాలి’’ అని చంద్రబాబు అన్నారు.