హైదరాబాద్: మార్చి 2 నుంచి పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLRPB) తెలిపింది. వీరితో పాటు విపత్తు నిర్వహణ, ఫైర్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. ప్రాథమిక పరీక్ష పూర్తయి దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్ మైదానంలో వీరికి మార్చి 2 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తామని నియామక మండలి వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈనెల 25న ఉదయం 8గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. www.tslrpb.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే support@tslrpb.in కు గానీ 9393711110 లేదా 9391005006 నంబరుకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపింది.
అడ్మిట్ కార్డు రెండు భాగాలుగా ఉంటుంది. పై భాగంలో అభ్యర్థి వివరాలు, పరీక్ష సమయం, వేదిక, సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఉంటాయి. దీనిని నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపర్చాల్సి ఉంటుంది. కింది భాగాన్ని చెకప్ స్లిప్‌గా సంబంధిత అధికారి పరీక్షా కేంద్రంలో రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకుంటారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సంతకం చేసిన దేహదారుఢ్య పరీక్ష ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, వాటి ప్రతులను తీసుకురావాలని నియామక బోర్డు వెల్లడించింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ అనంతరం ఆర్ఎఫ్డీ బ్యాండ్‌ను చేతికి ఇస్తామని వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.