4 నెలల్లోగా ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలి

Get real time updates directly on you device, subscribe now.

*_వేతన జీవికి వెసులుబాటు_*

*_అధిక పింఛను సౌలభ్యం కల్పించిన ఈపీఎఫ్‌వో_*

*_ఎక్కువ వేతనం పొందుతూ ఈపీఎస్‌ -2014 చట్టసవరణకు ముందు ఆప్షన్‌ ఇవ్వనివారికి అవకాశం_*

*_4 నెలల్లోగా ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలి_*

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను ప్రయోజనాలు పొందేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. ఈపీఎఫ్‌వో విధించిన గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనాలు పొందుతూ.. ఆ మేరకు వేతనాలపై ఉద్యోగి, యజమాని ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశమిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం-2014 చట్ట సవరణకు ముందు పేరా 11(3) కింద అధిక వేతనంపై అధిక పింఛను సదుపాయం కోసం ‘ఉమ్మడి ఆప్షన్‌’ ఇవ్వలేకపోయిన వారందరికీ 4 నెలల గడువు ఇచ్చింది. అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు, సుప్రీంకోర్టు తీర్పులోని పేరా 44(3), 44(4), 44(5)ల అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-1(పింఛన్లు) అప్రజిత జగ్గీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఈపీఎస్‌లో డిపాజిట్‌ సర్దుబాటు, అదనపు చెల్లింపుల వివరాలు, అధిక పింఛను లెక్కింపు విధానంపై తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ కార్యాలయాల ఇన్‌ఛార్జులు వారానికోసారి దరఖాస్తుల పరిష్కార వివరాల్ని జోనల్‌ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జోనల్‌ కార్యాలయాలు వారానికోసారి కేంద్ర కార్యాలయ పింఛను డివిజన్‌కు వివరాలు అందించాలని తెలిపారు. యజమానితో కలిసి ఉద్యోగులు ఉమ్మడి ఐచ్ఛికం ఇచ్చిన తరువాత ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ (గ్రీవెన్స్‌) పోర్టల్‌ ద్వారా నమోదు చేయాలని సూచించారు.

*_దరఖాస్తు ప్రక్రియ ఇలా.._*

* అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేయాలి. ఉమ్మడి ఆప్షన్ల దరఖాస్తు విధానం, వివరాలు, గడువు తేదీని ప్రాంతీయ కమిషనర్‌ వెల్లడిస్తారు.

* అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్‌ అంశంపై ఉమ్మడి ఆప్షన్‌ ఫారంలో కచ్చితంగా అంగీకారం తెలపాలి.

* ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్‌ను మినహాయిస్తున్న సంస్థలు భవిష్య నిధి ట్రస్ట్‌ నుంచి పింఛను నిధికి నగదు బదిలీ కోసం ట్రస్టీ నుంచి హామీపత్రం జతచేయాలి. నిధి సర్దుబాటు సమయానికి ఈపీఎస్‌ చందా బకాయిలు, వడ్డీ సహా సకాలంలో చెల్లించేలా హామీపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి.

* ఉమ్మడి ఆప్షన్‌తోపాటు అధిక వేతనంపై యజమాని చెల్లించిన వాటా జమకు సంబంధించిన ఆధారాలు, అధిక వేతనంపై పీఎఫ్‌ చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ గతంలో పేరా 26(6) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ రుజువును యజమాని ధ్రువీకరించాలి.

* దరఖాస్తు కోసం త్వరలో ప్రత్యేకంగా లింకు(యూఆర్‌ఎల్‌)ను ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకురానుంది. అది అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రాంతీయ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

Advertisement

* ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్లో పూర్తి చేసి.. డిజిటల్‌గా పంపించాలి. దరఖాస్తుదారుడికి ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. యజమాని లాగిన్‌కు దరఖాస్తు చేరుతుంది. దానిపై డిజిటల్‌ సంతకం చేసి.. తదుపరి పరిష్కారానికి ప్రాంతీయ కమిషనర్‌కు సమర్పించాలి.

*_గడువు తేదీ లేకపోవడంతో…_*

ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి (బేసిక్‌+డీఏ) రూ.6,500గా ఉంది. అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు.. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్‌లో జమ చేయాలి. కానీ, ఈ పథకంలో చేరేందుకు అప్పట్లో గరిష్ఠ గడువు తేదీని పేర్కొనలేదు. 2014లో చట్ట సవరణ ద్వారా గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. చట్ట సవరణకు ముందు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు.. అధిక వేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్‌ ఇవ్వాలని ఈపీఎఫ్‌వో సూచించింది. అయితే, 2014 సవరణకు ముందు ఈ పథకంలో చేరని ఉద్యోగులకు ఆప్షన్‌ ఇచ్చే అవకాశాన్ని కల్పించలేదు. చట్ట సవరణకు ముందు కచ్చితమైన గడువు లేకపోవడంతో అర్హులైన ఉద్యోగుల్లో చాలామంది ఆప్షన్‌ ఇవ్వలేకపోయారని, వారికి మరోసారి నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్‌కు అవకాశమిస్తూ ఈపీఎఫ్‌వో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

*_ఎవరు అర్హులు?_*

* తాజా ఆదేశాల ప్రకారం.. 2014 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం అధిక వేతనంపై పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన చందాదారులు, చట్ట సవరణ తరువాత 11(4) కింద నిర్ణీత గడువులోగా ఆప్షన్‌ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోయిన ఉద్యోగులు తాజాగా ఆప్షన్‌ నమోదు చేయవచ్చు. ఇందుకు నాలుగు నెలల సమయం ఉంది.

* 2014 సెప్టెంబరు 1 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్‌ చందాదారులుగా ఉంటూ… చట్టంలోని పేరా 26(6) ప్రకారం ఉద్యోగులు, యజమాని ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి (రూ.5 వేలు/రూ.6,500) కన్నా ఎక్కువ వేతనంపై చందా చెల్లిస్తూ.. 2014 సెప్టెంబరు 1 తరువాత కూడా సభ్యులుగా కొనసాగుతున్నవారు అర్హులు. చట్ట సవరణకు ముందు 11(3) కింద యజమానితో కలిసి ఉమ్మడి ఐచ్ఛికం ఇవ్వలేకపోయిన సభ్యులు అర్హులు.

* చట్ట సవరణకు ముందు 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ, సవరణ తరువాత 11(4) కింద అధిక పింఛనుకు ఆరు నెలల గడువులోగా ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన ఉద్యోగులెవరూ ప్రస్తుతం ఆప్షన్‌ ఇచ్చేందుకు అర్హులు కాదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment