శంషాబాద్, కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రులు
దిల్లీ: కేంద్ర కార్మిక శాఖ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రులను మంజూరు చేసింది. సోమవారం చండీగఢ్‌లో జరిగిన ఉద్యోగ రాజ్య బీమా సంస్థ పాలకమండలి సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ మేరకు ప్రకటించారు. శంషాబాద్‌లో 100 పడకలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీనికితోడు విజయవాడ సమీపంలోని గుణదలలో ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్స్యూరెన్స్ స్కీం (ఈఎస్ఐఎస్) కింద ఉన్న ఆసుపత్రిని ఈఎస్ఐసీ నిర్వహిస్తుందని వెల్లడించారు. దీనివల్ల అక్కడి కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్యం సేవలు అందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం శంషాబాద్‌కు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తంచేశారు.