జ్వరం వచ్చిన వెంటనే మాత్రలు వద్దు
హ్యూమన్ రైట్స్ టుడే/వాషింగ్టన్: పిల్లలకు ఏ కాస్త జ్వరం వచ్చినా వెంటనే దాన్ని తగ్గించే మాత్రలు వాడటం మంచిది కాదని అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు. వారు 12 ఏళ్లు, అంతకులోపు వయసున్న పిల్లలను పరిశీలించారు. పిల్లల శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హైట్ లోపే ఉన్నా కూడా ప్రతి ముగ్గురు తల్లిదండ్రులలో ఒకరు జ్వరం తగ్గించే పారాసెటమాల్ వంటి మాత్రలు వాడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల నుంచి 101.9 డిగ్రీల లోపు ఉంటే ప్రతి ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరు జ్వర మాత్రలు వాడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం మళ్లీ రాకుండా రెండో డోసు ఇస్తున్నారు. ఇలాంటి స్వల్ప జ్వరాలను వాటంతట అవే తగ్గనివ్వాలని పరిశోధకులు సూచించారు. పిల్లల ఒళ్లు వెచ్చబడటమనేది రోగంపై పోరాడే క్రమంలో జరుగుతుందని వివరించారు. జ్వరాన్ని తగ్గించినంత మాత్రాన వారి అస్వస్థత నయమైపోయిందని భావించరాదు. పిల్లలకు మరీ ఎక్కువ మందులు ఇస్తే దుష్పలితాలు వస్తాయి. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లల నుదుటి మీద కానీ, నోట్లో కానీ థర్మామీటర్ ఉంచి జ్వరాన్ని నమోదు చేస్తారు. ప్రతి ఆరుగురిలో ఒకరు చంకలో కానీ, చెవిలో కానీ ఈ సాధనాన్ని ఉంచి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. నుదుటి మీద, చెవిలో సరైన పద్ధతిలో థర్మామీటర్‌ను వాడితేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.