కేంద్రానికి రాసిన ఆ లేఖపై కేసీఆర్ చర్చకు సిద్ధమా?: బండి సంజయ్
హ్యూమన్ రైట్స్ టుడే/హనుమకొండ: రాష్ట్రంలో కొందరు పోలీసులు భారాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం ఆయన పర్యటించారు. పరకాల సబ్‌జైలు నుంచి విడుదలైన భాజపా నేతలను పరామర్శించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఈనెల 5న పంగిడిపల్లిలో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటనలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిని వదిలేసి భాజపా నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు భారాస కార్యకర్తల్లా మారిపోయారు. కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మరో మూడు నెలలు మాత్రమే భారాస అధికారంలో ఉంటుంది. చట్టాలను అతిక్రమించి భారాస కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు భారాస ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని బోరు బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెడతామని.. రుణమివ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా? లేదా? అని నిలదీశారు. ఈ విషయంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సంజయ్ సవాల్ విసిరారు.