అమిత్ షా మాట నిలబెట్టుకున్నారు: ఏక్నాథ్ శిందే
హ్యూమన్ రైట్స్ టుడే/పుణె: తన వెనుక రాయిలా నిలబడతానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటిచ్చారని.. దాన్ని ఆయన నిలబెట్టుకున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అన్నారు. అసలైన శివసేన, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’ శిందే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకంది.
‘‘శిందేజీ మీరు ధైర్యంగా ముందుకెళ్లండి అని అమిత్ షా నాతో చెప్పారు. మేం మీ వెనకాల రాయిలా నిలబడతాం. ఆయన ఏం చెప్పారో అదే చేశారు’’ అని శనివారం సాయంత్రం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో శిందే అన్నారు. గత ఏడాది జూన్లో ఏక్నాథ్ శిందే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మోదీ ఫొటోతో ఓట్లడిగారు: షా
ఎన్నికల సంఘం నిజానికి, అబద్ధానికి మధ్య వ్యత్యాసం ఏంటో నిరూపించిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. సత్యమేవ జయతే సిద్ధాంతం మరోసారి రుజువైందన్నారు. పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో మోదీ ఫొటోను చూపించి ఓట్లు అడిగారని ఉద్ధవ్ వర్గాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం పదవి కోసం ఆశపడ్డారని విమర్శించారు. దానికోసం వాళ్లు (ఉద్ధవ్ వర్గం) కాంగ్రెస్, ఎన్సీపీ కాళ్లపై పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.