ఖమ్మం జిల్లా మధిరలో దారుణం..

Get real time updates directly on you device, subscribe now.

వంటలు బాగాలేవన్నందుకు.. గురుకుల బాలికలను చితక్కొట్టిన ప్రిన్సిపల్‌

ఖమ్మం జిల్లాలో మధిరలో దారుణం

హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం/మధిర పట్టణం: వంటలు సరిగా ఉండటం లేదంటూ విద్యార్థి సంఘం నాయకులకు చెప్పారనే కోపంతో సదరు విద్యార్థినులను ప్రిన్సిపల్‌ విచక్షణారహితంగా దండించారు. ఈ దారుణ ఘటన గురువారం ఖమ్మం జిల్లా మధిరలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల బాలికల వసతిగృహంలో చోటుచేసుకుంది. బాలికల కాళ్లకు వాతలు తేలి కమిలిపోయిన దృశ్యాల వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. మధిర పురపాలికలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థల ప్రాంగణంలో గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ హాస్టల్‌ను సందర్శించిన ఓ విద్యార్థి సంఘం నాయకుడికి విద్యార్థినులు తమ కష్టాలను ఏకరవు పెట్టారు. అన్నం, కూరలు సరిగ్గా ఉండటం లేదని, కూరల్లో కారానికి బదులు ఎండుమిర్చి వేస్తుండటంతో కడుపులో మంట వస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. విద్యార్థినులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు ప్రిన్సిపల్‌ 20 మందికి పైగా బాలికలను ఓ గదిలోకి పిలిచి కర్రతో తీవ్రంగా కొట్టడంతో వాతలు తేలాయి. కొందరికి కొట్టినచోట కమిలిపోయి గాయాలయ్యాయి. ఇక్కడ విషయాలు బయటకు చెబితే మీ సంగతి చూస్తానంటూ కొట్టారని విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు, భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి వసతిగృహాన్ని సందర్శించారు. విచారణ చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ను కోరారు.

ఈ విషయమై సదరు ప్రిన్సిపల్‌ నజీమాను వివరణ కోరగా పదోతరగతి అంతర్గత పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, భయం కోసం రెండు దెబ్బలు వేశానని చెప్పారు. రోజూ నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment