వారణాసిలో ఒక్కయువతిపై 23మంది అత్యాచారం చేసిన ఘటనపై మోదీ ఆరా..
హ్యూమన్ రైట్స్ టుడే: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకున్న దారుణ సామూహిక అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. 6 రోజుల్లో 23 మంది వ్యక్తులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన ఇటీవల వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇది ప్రధాని మోదీ దృష్టికి చేరడంతో ఆయన ఆరా తీశారు. శుక్రవారం వారణాసి కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
మోదీ ఈ రోజు వారణాసిలో పర్యటించారు. ఉదయం అక్కడ ల్యాండ్ కాగానే ఇటీవల జరిగిన అత్యాచార ఘటన గురించి జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్, డివిజినల్ కమిషనర్ లను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 29వ తేదీన బాధిత యువతి కొంతమంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సామూహిక అత్యాచారం గురించి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఆ యువతి వెల్లడించిన వివరాల ప్రకారం కొందరు యువకులు తనను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దర్యాప్తు జరిపిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
