సినిమాను తలపించేలా తారకరత్న జీవితం..
ప్రేమ పెళ్లి, రాజకీయం ఇలా..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: నందమూరి తారక రామారావు పన్నెండవ సంతానంలో 5వ కొడుకు మోహనకృష్ణ. మోహనకృష్ణ కూడా సినిమా రంగంలో పనిచేసిన వారే. ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా మొహన్‌కృష్ణ పనిచేశాడు. మోహన్ కృష్ణ, సీత దంపతులకు 1983లో జనవరి 8వ తేదీన తారకరత్న జన్మించాడు. ఏడవ తరగతి వరకు చెన్నైలో చదువుకున్న తారకరత్న ఆ తర్వాత హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్ విద్యను పూర్తిచేశాడు. ఇక గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు.
సినీ జీవితం:
అప్పటికే తారకరత్నకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాద్రి రాముడు’ వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘భద్రాద్రిరాముడు’ వరకు కెరీర్ మంచి స్పీడ్‌లోనే ఉంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించాయి. ఇక అప్పుడే రవిబాబు ప్రోత్సాహంతో ‘అమరావతి’ సినిమాతో విలన్‌గా మారి తొలి సినిమాతోనే విలన్‌గా నంది అవార్డు గెలుచుకున్నాడు.
ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘నందీశ్వరుడు’ అనే మాస్ సినిమా తీశాడు. అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టి సంఘ విద్రోహశక్తిగా మారిన ఒక ఉత్తమ విద్యార్థి పాత్రలో తారకరత్న జీవించాడు. ఈ సినిమాతో తారకరత్న మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. రిలీజ్ రోజున పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. పోటీగా ‘బిజినెస్ మ్యాన్’, ‘బాడీగార్డ్’ సినిమాలుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే హీరోగా ఈ సినిమాతో తారకరత్న మరో మెట్టు ఎక్కాడు.
ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొంచెం కొంచెంగా తరకరత్న ఫేడవుట్ అయ్యాడు. అయితే తన క్రేజ్ ఎలా ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలే చేశాడు. ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరగా ఆయన క్రిష్ రూపొందించిన ‘9అవర్స్’ వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ వెబ్‌సిరీస్‌లో తారకరత్న పోలీస్ పాత్రలో నటించాడు. దీనికి ముందు ‘S5 నో ఎగ్జిట్’ అనే థ్రిల్లర్ సినిమా చేశాడు. ఇదే తారకరత్న నటించిన చివరి చిత్రం. తారకరత్న ఇప్పటివరకు మొత్తం 22 సినిమాల్లో నటించాడు. ఆయన సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్నాయి.
పెళ్లి:
నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం. 2012లో తారకరత్న, అలేఖ్యరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అలేఖ్య ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాకుండా తారకరత్న.. చెన్నైలో అలేఖ్య సిస్టర్‌కు సీనియర్ అట. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ల పెళ్లికి ఇరు కుంటుబాల నుంచి అంగీకరించలేదట. అయితే అదే టైమ్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి మద్ధతు ఉండటంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్‌లో జరిగిందని అప్పట్లో ఓ ఇంటర్వూలో అలేఖ్య చెప్పింది. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
రాజకీయం:
నటుడిగా కొనసాగుతుండానే గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో యాక్టీవ్‌గా మారారు. చంద్రబాబు, లోకేష్ కూడా తారకరత్నను ప్రోత్సహించడంతో ఆయన ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ స్థానిక నాయకులను కలుస్తూ వచ్చాడు. రానున్న ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తానని గతంలో చెప్పాడు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నాడు. గతనెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.