దక్షిణాది సెంటిమెంట్ పెంచుతున్న తమిళ పార్టీలు..

Get real time updates directly on you device, subscribe now.

దక్షిణాది ఉద్యమం కాకూడదు విభజన వాదం !

హ్యూమన్ రైట్స్ టుడే/చెన్నై/ మార్చి 22: లోకసభ సీట్ల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనీ దీన్ని అడ్డుకోవడానికి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు మేరకు చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేవారు ఎవరు అన్న విషయం పక్కన పెడితే హక్కుల కోసం పోరాటం అనేది ప్రజాస్వామ్య హక్కు అయితే అది విభజన వాదానికి దారి తీస్తే మాత్రం దేశాన్ని బలహీనం చేసినట్లవుతుంది.

దక్షిణాది సెంటిమెంట్ పెంచుతున్న తమిళ పార్టీలు

దక్షిణాదికి అన్యాయం అనే వాదనను తమిళ పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకతగా మారాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పార్టీలు తమకు అవసరమైనప్పుడల్లా దక్షిణాది వాదాన్ని తెరపైకి తీసుకు వస్తాయి. గతంలో టీడీపీ, జనసేన, కేరళలోని కమ్యూనిస్టు పార్టీలు, కర్ణాటకలో జేడీఎస్ కూడా ఇలాంటి వాదనలు తెచ్చినవే. ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోనున్న స్టాలిన్ ఆ బాధ్యత తీసుకున్నారు.

హక్కుల కోసం పోరాటం ప్రజాస్వామ్య పథం

హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు. అందులో తప్పేమీ లేదు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు విభజన వాదం చెలరేగే ప్రమాదం ఉంది. అదుపు లేని నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి వాటిని అదుపు చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే అది విభజన వాదమే. దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా దక్షిణాది తన ప్రాధాన్యతను కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.

ఖరారు కాని డీలిమిటేషన్ విధానం

జనాభాను బట్టి డీలిమిటేషన్ జరుగుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఓ ప్రాంతంపై వివక్ష చూపించడం ఎంత ప్రమాదకరమో దేశ నాయకత్వానికి తెలుస్తుంది. అందుకే దక్షిణాది ప్రాధాన్యత తగ్గకుండా చూస్తారని భావించవచ్చు. అయితే వాయిస్ రైజ్ చేయకుండా సైలెంటుగా ఉంటే అన్యాయం చేసే అవకాశాలు ఉంటాయి. స్టాలిన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశం దక్షిణాది హక్కుల పోరాటానికి మంచి ముందడుగే. కానీ చేయి దాటకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందన్నది నిపుణుల అభిప్రాయం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment