కోట్లు దోచేసి, మహిళలకు కుచ్చుటోపి!
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ మార్చి 22: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈవో వెంకటరమణ గత 20 రోజులుగా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ మహిళలు ఒక్కొక్కరు లక్షల్లో సొమ్మును ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేయడంతో ఆ డబ్బు తిరిగి వస్తుందో రాదోనని తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు మహిళలు సీఈవో స్వస్థలం కడపకు వెళ్లి అతని ఇంటి దగ్గర ఆరా తీయగా సీఈవో రమణ ఆచూకీ లేకపోవడంతో వారికి నిరాశ మిగిలింది.
సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యి వెళ్ళాడని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. గత 20 రోజులుగా అందుబాటులో లేరని వారు పోలీసులకు తెలిపారు.
చివరికి డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించడంతో సీఈవో వెంకట రమణ డిపాజిటర్ల నగదు, బంగారం స్వాహా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటరమణ ఆచూకీ కోసం వేట ప్రారంభించారు.
