న్యాయమూర్తి ఇంట్లో అక్రమ డబ్బు?
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/మార్చి 21: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో భారీగా డబ్బు దొరకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా నగదు బయట పడింది.
ఇది లెక్కల్లో చూపని డబ్బు కావడంతో వివాదం రాజుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం న్యాయ వ్యవస్థను కుదిపేస్తోంది. అసలు ఎవరీ యశ్వంత్ వర్మ? అనేది హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ఆయన అలహాబాద్ హైకోర్టులో ఉండే వారు. అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. అక్టోబర్ 2021 నుంచి ఢిల్లీ కోర్టులో ఉన్నారు. జస్టిస్ వర్మ తొలుత అక్టోబర్ 2014లో అలహాబాద్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత అంటే 2016లో ఆ కోర్టు శాశ్వత మెంబర్ గా ప్రమాణం చేశారు.
ఢిల్లీ హైకోర్టు వెబ్ సైట్ ప్రకారం యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ హన్స్ రాజ్ కాలేజీలో బీకామ్ హానర్స్ చదివారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ అందుకున్నారు.
1992 ఆగస్టు 8న అలహా బాద్ హైకోర్టులో అడ్వకేట్ గా ఎన్ రోల్ చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వెబ్ సైట్ ప్రకారం యశ్వంత్ వర్మ రాజ్యాంగం, కార్మిక వివాదాలకు సంబంధించిన విషయాలను, అలాగే పరిశ్రమలు, కార్పొరేషన్లు, పన్నులను నియంత్రించే చట్టాలను నిర్వహించారు.
