పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన… 2 లక్షలు వరకు షూరిటీ లేకుండా లోన్.. వివరాలివే..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ మార్చి 17: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఉచిత సౌరశక్తిని అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ సోలార్ చొరవగా పేరుగాంచిన ఈ పథకం ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సోలార్ ఎనర్జీ అందించింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 మార్చి నాటికి కోటి ఇళ్లకు సౌరశక్తిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీం ముందుకు సాగుతోంది.
ఈ పథకం ప్రయోజనాలు ఏంటి?
గృహ యజమానులకు సౌర ఫలకాలను అమర్చుకోవడానికి 40% వరకు సబ్సిడీ.
12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75% సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలను అందిస్తున్నాయి.
రూ. 78,000 వరకు సబ్సిడీ లభించనుంది.
సంవత్సరానికి కేవలం 6.75% వడ్డీ రేటుతో రూ. 6 లక్షల వరకు రుణం తీసుకునే ఛాన్స్.
రూ. 2 లక్షల వరకు రుణాలకు ఎలాంటి ఆదాయ పత్రాలు అవసరం లేదు.
మొత్తం ఖర్చులో 90% వరకు బ్యాంకు ఫైనాన్స్ సదుపాయం.
అర్హత ప్రమాణాలు..
దరఖాస్తు దారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి.
సౌర ఫలకాలను అమర్చడానికి అనువైన పైకప్పు గల ఇంటి యజమానిగా ఉండాలి.
ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
ఇంతకు ముందు ఎలాంటి ఇతర ప్రభుత్వ సబ్సిడీని పొందకూడదు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజనకు దరఖాస్తు విధానం..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in/ ను సందర్శించండి.
వినియోగదారుల ట్యాబ్‌లో “ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి (లేదా) “కన్స్యూమర్ లాగిన్” పై క్లిక్ చేయండి.
మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరించండి.
మీ పేరు, రాష్ట్రం, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఇమెయిల్ ఐడీ ధృవీకరించండి.
మీరు అవసరమైతే విక్రేత ఎంపికకు “అవును” లేదా “కాదు” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
‘సోలార్ రూఫ్‌టాప్ కోసం దరఖాస్తు చేసుకోండి’ పై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను నమోదు చేయండి.
సాధ్యాసాధ్య అంగీకారాన్ని పొందిన తర్వాత, విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను సమర్పించండి.
ఆపై మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను అమర్చుకోవచ్చు.
