🙏🌺తీర్ధం ఎలా తీసుకోవాలి 🌺🙏
హ్యూమన్ రైట్స్ టుడే/భక్తి: తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు “అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం… పాదోదకం పావనం శుభం” అంటూ తీర్ధం ఇస్తారు. భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన… ఈ తీర్ధం మిమ్మల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది…. సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది… అని భావం. భగవంతుని దగ్గరకు వచ్చేవరకు అది ఉత్తి నీరే. కాని ఆయనను చేరాక అందులో తులసి, కర్పూరం… వంటివి చేరి తీర్ధంగా మారుతుంది. పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం, తులసి వంటివి ఆరోగ్యకారకాలు. గొంతులో ఏదైనా అడ్డుపడ్డట్టుగా ఉంటే తులసి ఆకు నమిలితే చాలు అడ్డు తొలగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. అలాగే కర్పూరం కూడా ! పురుషులు ఉత్తరీయాన్ని, స్త్రీలు పైటచెంగును చేతికింద పెట్టుకుని భగవత్ప్రసాదంగా భావిస్తూ ఒక్క చుక్క కూడా కిందపడనివ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్ధం తీసుకోవాలి. శ్రీ విద్యా ఉపాసకులు నాలుగు సార్లు తీసుకుంటారు. అయితే అది అందరికీ వర్తించదు.ఉపవాసం వున్న రోజు ఒక సారే తీర్ధం తీసుకోవాలట. మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం, రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు, మూడవది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి. మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు. తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వుటాయి. అందుకే తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో, ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యాన్నీ, నా ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుందనే సద్భావంతో తీసుకోవాలి.