హోలికా దహనం విశిష్టత ఏమిటి..!!

Get real time updates directly on you device, subscribe now.

Holi 2025: హిందువులు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హోలికా దహనం విశిష్టత ఏమిటి..!!

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ మార్చి 14:
హిందువులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ విశిష్టత దాగి ఉంటుంది. ఇక హిందువులు జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. మార్చి 14న (శుక్రవారం) హోలీ పండుగ సందర్భంగా హిందువులు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హోలీకా దహనం విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పురాణ కథనం..

హోలీ పండుగ ముందు రోజు రాత్రి హోలీకా దహనం వేడుకను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం.. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులచే, జంతువులచే తనకు చావు రాకూడదని బ్రహ్మాదేవుడి వద్ద వరం పొందుతాడు. ఆ గర్వంతో తనను తాను దేవుడిగా ప్రకటించుకుని తన రాజ్యంలోని ప్రజలందరిని తననే పూజించాలని చెబుతాడు. అయితే, హిర్యణకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తల్లి గర్భంలో ఉండగానే శ్రీ మహా విష్ణువు భక్తుడిగా మారుతాడు. దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని హిరణ్యకశ్యపుడి సోదరి హోలికను ఆదేశిస్తాడు.

హోలికకు అగ్ని దహింపజాలదు (అగ్ని ఆమెను కాల్చలేదు) అనే వరం ఉంటుంది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశ్యపుడు అనుకుంటాడు. కానీ, ఆ అగ్నిలో హోళికా దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా హోలీ ముందురోజు రాత్రి హోళికా దహనం చేస్తారు. ఈ హోళిక దహనం తర్వాత బూడిదను హిందువులు తమ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంటారు. దీని వల్ల తమ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉంటాయని వారి నమ్మకం.

మారుతున్న కాలానికి సూచిక..

హోలీ పండుగ చలి కాలానికి వీడ్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటివి జరుగుతాయి. అందుకే నూతన ప్రారంభాలకు స్వాగతం పలుకుతూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. అయితే, ప్రాంతాన్ని బట్టి వేడుకల తీరు, సంప్రదాయం మారుతూ వస్తుంది. అలాగే, హోలీని ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఎక్కడ ఏ విధంగా జరుపుకున్నా కూడా పరమార్థం మాత్రం ఒక్కటే.

ఇక హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత, ఆనందాన్ని పెంచుతుంది. రంగులు చల్లుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, బంధువులతో కలసి ఆనందంగా గడుపుతారు. ఇది పాత విభేదాలను తొలగించి కొత్త స్నేహాన్ని ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, సామాజిక బంధాలు కూడా బలపడుతాయి.

హోలీ రంగులు ఎప్పుడూ సహజసిద్ధమైనవి వాడుకోవాలి. ప్రకృతిలో లభించే మోదుగ, బంతి పూలు, ఆకులు, బచ్చలి ఆకులు, బీట్‌రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకులతో తయారు చేసుకునే రంగులే చల్లుకోవాలి. ఇవి కాకుండా మార్కెట్‌లో లభించే కెమికల్స్ ఉండే రంగులు చల్లుకుంటే చర్మానికి హాని కలుగుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment