చికెన్‌ కోసం కోడిని, మటన్ కోసం మేక గొంతు కోసినంత ఈజీగా.. సాటి మనిషిని..

Get real time updates directly on you device, subscribe now.

మాయమైపోతున్నాడు…మనిషి…..పరాయి మగాడి కోసం..పరాయి స్త్రీ కోసం…రాత్రికి రాత్రే రక్త చరిత్ర..

నా అనుకున్న వాళ్లే నరకం చూపిస్తు చంపేస్తున్నారు..

మద్యానికి బానిస అయిన కొడుకు కన్న తల్లినే చంపేశాడు…

కేవలం 5రూపాయల కోసం …కట్టుకున్న భార్యనే స్నేహితులుకి అప్ప చెప్పిన భర్త…..

డబ్బుకోసం తండ్రిని చంపిన కొడుకు….కన్న పేగు బంధం అనే తేడా లేకుండా కూతురి పై తండ్రి చేసిన వికృత పనులు….

దేనికి సమాజం ఇలా తయారు అవుతుంది…రాబోయే రోజుల్లో…మనిషిని క్రూర మృగం అనాలా…!

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/మార్చి 08: మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది అయినవాళ్లు తమ ఆత్మీయులను, కుటుంబసభ్యులను దారుణంగా కడతేర్చటం.. ఇంకా గుండెల మీద వేసుకుని పెంచిన కన్నతల్లిని చంపిన కన్నకొడుకు.. జన్మనిచ్చిన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన పుత్రరత్నం.. ఎంతో అనురాగంతో పెంచి పెద్ద చేసిన తాతయ్యను కసితీరా కత్తి పోట్లతో కడతేర్చే మనుమడు.. ఇంకా నాతి చరామి అంటూ ఏడడుగులు వేసిన భర్తను పైలోకాలకు పంపే భార్య.. అలాగే ఇంటి దీపాన్ని ఆర్పేసుకునే మరో మూర్ఖుడు.. ఇలా ఒకటేమిటి… కన్నవారిని, కట్టుకున్న వారినీ, ఇంకా చెప్పాలంటే అయిన వారినీ, తమ వారినే పొట్టన పెట్టుకుంటున్న కిరాతకులు రోజుకొకరు కనిపిస్తున్నారు. అసలు మనిషనే వాడు మాయ మైపోతున్నాడనే కవి మాటను నిజం చేస్తున్నారు. చికెన్‌ కోసం కోడిని చంపినంత ఈజీగా, మటన్ కోసం మేక గొంతు కోసినంత ఈజ్‌గా.. సాటి మనిషిని చంపేస్తున్నారు. ఒక దగ్గర చెరువులో బాడీ పార్ట్స్‌ కనిపించాయి. మనిషి ఆకారంలో వచ్చేంత వరకు ఎక్కడెక్కడో పడేసిన ఆ శరీర భాగాలను తీసుకొచ్చి కలిపితే మొత్తం ఐదు ముక్కలుగా నరికి పడేశారని అర్థమైంది. కారకులు ఎవరా అని ఆరా తీస్తే భార్యే ఆ పని చేసిందని తేలింది. ఎందుకు చంపావ్‌ అని పోలీసులు తమ స్టైల్‌లో అడిగితే ‘పరాయి మగాడి కోసం’ అని చెప్పింది. భర్త స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ ఇల్లాలు అడ్డుగా ఉన్నాడని ఇంటాయన్నే కిరాతకంగా చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిందీ ఘోరం. ‘ఇలాంటోళ్లు కూడా ఉంటారా’ అనే సంఘటన నెల క్రితం జరిగింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ అయిందా వార్త..

నీఛం.. ఎన్నో ఘటనలు..
‘అప్పులున్నాయ్‌.. పిల్ల చదువుకు డబ్బులు కావాలి, అందుకు ఓ పని చేయగలవా’ అని అడిగింది ఇంటావిడ. ‘కిడ్నీ అమ్మితే 10 లక్షలు వస్తాయ్’ అని చెప్పే సరికి ‘సరే అప్పులు తీరతాయి కదా’ అని కిడ్నీ ఇచ్చేశాడా భర్త. అంతే 10 లక్షలు చేతిలో పడగానే సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది ఆ భార్య. పశ్చిమ బెంగాల్‌లో జరిగిందీ సీన్. చెప్పడానికే అసహ్యం అనిపించే ఘోరం ఒకటి జరిగింది. తాగడానికి డబ్బుల్లేవని తన స్నేహితులతోనే పడక పంచుకోమన్నాడో దుర్మార్గపు భర్త. ‘ఛీ.. నువ్వూ ఓ భర్తవేనా’ అని ఛీత్కరించుకున్నందుకు ఆ స్నేహితులతోనే రేప్‌ చేయించాడు. అక్కడితో ఆగలేదు ఆ దారుణం. ఎలాగూ రేప్ చేశాం కదా అని పదే పదే అత్యాచారం చేయడం మొదలు పెట్టారు. అయినా భర్త అడ్డుకోలేదు. చివరికి పోలీసుల దగ్గరికెళ్లి రక్షించాలని వేడుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిందీ దారుణం. 5 రూపాయలకు ఫ్యాక్షన్‌ హత్య జరిగిందని త్రివిక్రమ్‌ సినిమా తీస్తే 5 రూపాయలకు హత్య ఏంటని కొందరు నవ్వుకున్నారు. కాని, గుట్కా కొనుక్కోడానికి 10 రూపాయలు ఇవ్వలేదని కన్నతండ్రినే చంపేశాడో కొడుకు. అది కూడా ఎంత దారుణంగా చంపేశాడో తెలుసా. కత్తితో తండ్రి తల నరికి దాన్ని తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. ఒడిశాలో జరిగిందీ ఘోరం. 70 ఏళ్ల వయసున్న తండ్రిని 40 ఏళ్ల వయసున్న కొడుకు 10 రూపాయలు అడగడం, తండ్రి ఇవ్వక పోవడం, ఆవేశంలో తల నరకడం. మనుషులేనా వీళ్లు అనిపిస్తోంది కదా. కొడుకు పుట్టగానే వాడే తమను పున్నామ నరకం తప్పిస్తాడని మురిసిపోతారు తల్లి దండ్రులు. ఆ కొడుకే కిరాతకంగా కత్తితో పొడుస్తుంటే.. ‘చంపకురా అని చేతులెత్తి మొక్కడం’ తప్ప ఏం చేయలేకపోతున్నారు. హైదరాబాద్‌ తెల్లాపూర్‌లో తల్లిని, కుషాయిగూడలో తండ్రిని చంపేసిన ఘటనలు కూడా ఇవే కదా. కన్నకూతురు శరీరాన్ని ఎవరైనా తాకుతున్నారంటేనే రగిలిపోతాడు తండ్రి. అలాంటిది కోరిక తీర్చమని హింసించాడు. ఒప్పుకోకపోయే సరికి కూతురి నగ్న వీడియోలు తీసి బెదిరించాడు. రంగారెడ్డి జిల్లా ఇబహీంపట్నంలో నమోదైందీ కేసు.

ఇవన్నీ వింటుంటేనే జుగుప్సాకరంగా, అత్యంత అసహ్యంగా ఉన్నాయి కదా. ఏం చేస్తాం..లోకం పోకడ అలా మారింది. వావివరసలు మరిచి, కన్నపేగు అంటే అర్థం తెలియని, ఏడడుగులు వేసిన బంధాన్ని కాదని.. ఇలా పేట్రేగిపోతున్నారు మనుషులు. ఇంతకీ మనిషిలో మానవత్వం, ఆత్మీయత, అనురాగాలు కనుమరుగవడానికి కారణాలేంటి? అలాంటి దారుణాలకు దారితీస్తున్న పరిస్థితులేంటి? అలా జరిగిన ఇంకొన్ని సంఘటనల గురించి డిటైల్డ్‌గా చూడండి.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య..
ఒక భర్త ఉదయాన్ని పొలానికి వెళ్లి, కష్టపడి పనిచేసి, ఇంటికొచ్చాడు. కారణమేంటో తెలీదు గానీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. చూస్తే ప్రాణం లేదు. తనతో ఏడడుగులు వేసిన భర్త నాతిచరామి అంటూ జీవితాంతం తోడుంటానని హామీ ఇచ్చిన భర్త ఇక లేడని తెలియగానే ఆ భార్య కూడా చనిపోయింది. ఈ సోమవారం హిందూపురంలో జరిగిందిది. విడదీయరాని అనుబంధం అంటే అదీ. కొన్ని గంటల క్రితం మనమంతా ఓ న్యూస్‌ చూశాం. ‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య’ అని. కారణం.. వరకట్న వేధింపులు. పోనీ..అదేమైనా పెద్దలు కుదిర్చిన సంబంధమా అంటే.. అదేం కాదు. చూపులు, అభిప్రాయాలు కలిసి, ఒకరినొకరు ప్రేమించుకుని, ఇరువైపుల పెద్దలను ఒప్పించి, ఎంతో గ్రాండ్‌గా గోవాలో పెళ్లి చేసుకున్న జంట వారిది. ఇద్దరూ ఉద్యోగస్తులే. పైగా ప్రేమ పెళ్లి. అయినా.. ఈ కట్నకానుకల గొడవేంటో..! సరే.. వాళ్లిద్దరూ బాగుంటే అదే చాలు అనుకున్న ఆ అమ్మాయి తల్లి దండ్రులు 5 లక్షల నగదు, 15 తులాల బంగారం కూడా పెట్టారు. అయినా సరి పోలేదేమో..ఇంకా ఇంకా మానసికంగా హింసించే సరికి..‘ఇక భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని లెటర్‌ రాసి మరీ ఉరేసుకుంది. వికారాబాద్‌ జిల్లా తోర్‌మామిడి కమలాపురం ప్రాంతానికి చెందిన దేవిక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో చేస్తున్న మంచిర్యాలకు చెందిన సతీశ్‌ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి లాస్ట్‌ ఆగస్ట్‌లో గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. దేవిక, సతీశ్‌ చంద్ర.. రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్‌లో కాపురం పెట్టారు. దారుణమైన విషయం ఏంటంటే వీళ్లకు పెళ్లై జస్ట్‌ ఆరు నెలలే అవుతోంది. పెళ్లైన రెండో నెల నుంచే గొడవలు మొదలయ్యాయి. చివరికి వరకట్న వేధింపుల వరకు వెళ్లాయి ఆ గొడవలు. హిందూపురం ఘటనలో భర్తే ప్రాణం అనుకుంది భార్య. ఆయన ప్రాణం పోయిన క్షణమే ప్రాణం తీసుకుంది. కాని, రాయదుర్గం ఘటనలో మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో జీవితాంతం నడవలేనని చెప్పి ఆత్మహత్య చేసుకుంది.


భర్త క్రూరత్వం..
ఎంత క్రూరత్వం ఉంటే కొట్టి మరీ చంపుతారు చెప్పండి. భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకోడానికి ఆ భర్త ఎంతలా కొట్టాడంటే ఆ దెబ్బలకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుండగానే చనిపోయింది ఆ భార్య. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాద్‌లో జరిగిందీ దారుణం. భర్త శ్రీనివాస్ భార్యపై అనుమానంతో చావబాదాడు. ఆమె వయసు 52 సంవత్సరాలు. ఈ వయసులో కూడా అనుమానం ఏంటని అనుమానించొచ్చు. అసలు పెళ్లి నాటి నుంచే అనుమానపు శాడిస్ట్‌ భర్త అతను. అందుకే, ఇన్నేళ్లుగా కొడుతూనే వచ్చాడని చెబుతున్నారు మృతురాలి బంధువులు.

ప్రెషర్‌ కుక్కర్‌ మర్డర్..
కనీసం ఓ దశాబ్దం పాటు అందరూ గుర్తుంచుకుని, చర్చించుకునే హత్య మీర్‌పేటలో జరిగిన ప్రెషర్‌ కుక్కర్‌ మర్డర్. కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా చేస్తున్న గురు మూర్తి భార్య వెంకట మాధవిని దారుణంగా హత్య చేసి, డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించాడు. ఆమె ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేశాడు. ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా వాటిని చెరువులో విసిరేశాడు. భార్యపై అనుమానం, ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచనతో చేసిన ఘోరం ఇది. ఈ హత్య చేసిన తీరు విన్నాక ‘మనిషన్న వాడు ఇంతటి ఘోరం చేయగలడా’ అని ఎవరికి వారే ప్రశ్నించుకున్నారు. క్రూరత్వానికి, మనిషిలోని మృగత్వానికి ఏదైనా పేరు పెట్టాలంటే అది గురు మూర్తే అని మాట్లాడుకున్నారు. అంత దారుణమైన హత్య అది.

కన్నతల్లిని చంపిన కసాయి..
కన్నతల్లిని చంపుతారాఅండి ఎవరైనా..! మనిషిలో మానవత్వం చచ్చిపోతోందనడానికి ఇంత కన్నా సాక్ష్యం ఇంకేం కావాలి. తాను పుట్టిందే అమ్మ పేగు తెంచుకుని అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనిపెంచిన తల్లి అని కూడా చూడకుండా కిరాతకంగా పొడిచి మరీ చంపేశాడు. తెల్లాపూర్‌లోని డివినో విల్లాస్‌లో జరిగిందీ ఘోరం. మల్లారెడ్డి, రాధికారెడ్డికి దంపతుల చిన్నకొడుకు కార్తీక్‌రెడ్డి. వయసు 26 ఏళ్లు. చిన్నవయసులోనే దారి తప్పి, మద్యం మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. కొడుకును ఎలాగైనా మార్చాలనుకున్న ఆ తల్లి కోయంబత్తూరులోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు కూడా పంపించారు. తన కొడుకు మారాడనుకుని ఇంటికి తెచ్చుకున్నారు. కాని, మనిషిలోని మృగం మాత్రం మారలేదు. కోట్ల విలువైన పొలం తన పేరిట రాయాలని ఒత్తిడి తెచ్చాడు. తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆస్తి పంపకాలు చేయాల్సిందేని ఘర్షణకు దిగాడు. చివరికి తల్లిపైనే కత్తితో దాడి చేశాడు. దాదాపు 8సార్లు పొడిచాడు. అడ్డొచ్చిన తండ్రిపైనా దాడి చేయడంతో ఆయన చేతులకు గాయాలు అయ్యాయి. రక్తమోడుతున్న రాధికారెడ్డిని నలగండ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినా సరే ప్రాణం మాత్రం దక్కలేదు.

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అని ఓ కవి రాసిన మాటలు అక్షర సత్యాలవుతున్నాయి. అవును నిజమే.. మానవత్వం మంట కలుస్తోంది. బంధాలు, బంధుత్వాలూ మరిచి కొందరు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో అయిన వాళ్లనే కడతేర్చుతున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఈ తరహా హత్యలు సర్వసాధారణమయ్యాయి. పట్టపగలే నడిరోడ్డుపైనే దారుణానికి ఒడిగట్టిన సందర్భాలున్నాయి. మేడ్చల్‌లో పట్టపగలే అన్నను తమ్ముడు నరికి చంపిన ఘటన, ఆ తర్వాత కుషాయిగూడలో కన్నతండ్రిని కుమారుడు కడతేర్చిన ఘటన.. అంతకు ముందు ఆస్తి కోసం తాతను మర్డర్ చేసిన మనవడి ఉదంతం.. ఇలా ఒకదానిని మించి మరొకటి ఉలిక్కి పడేలా చేశాయి.

విశాఖలోనూ దారుణ హత్య ..
ప్రశాంతకు మారుపేరైన విశాఖలోనూ దారుణ హత్య జరిగింది. లాస్ట్‌ జనవరిలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని చెప్పినందుకు కన్నతల్లినే కొట్టి చంపేశాడో కొడుకు. విశాఖపట్నంలో జరిగిన ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఇండియన్‌ నేవీలో పనిచేస్తున్న ఉద్యోగి కుటుంబం నేవీ క్వార్టర్స్‌లో ఉంటోంది. కుమారుడు అల్కాసింగ్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఇకపై గేమ్స్ ఆడొద్దని తల్లి మందలించినందుకు ఆమెపై కక్షపెంచుకుని, కొట్టి చంపేశాడు.

అసలు కొందరు కొడుకులు, కూతుళ్లను చూస్తుంటేనే వణికి పోతున్నారు కొందరు తల్లిదండ్రులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ‘మా అబ్బాయి నుంచి మాకు ప్రాణ హాని ఉంది’ అంటూ పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు పేరెంట్స్‌. తాడేపల్లి మండలం రాధారంగా నగర్‌కు చెందిన కామినేని శ్రీనివాసరావు, తులసి తమ కుమారుడు త్రినాథ్‌ నుంచి ప్రాణహాని ఉందంటూ డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశారు. తనకు పిల్లలు లేకపోయినా త్రినాథ్‌ను కొడుకులా పెంచుకున్నానని, కాని, త్రినాథ్‌, ఆయన భార్య మౌనిక తమను చంపాలనుకుంటున్నారని కంప్లైంట్‌ చేశారు.


తండ్రిని చంపిన కొడుకు..
తండ్రి తాగుడుకు బానిస అయ్యాడని కొడుకే అంతమొందించాడు. అది కూడా పట్టపగలు, నడి రోడ్డుపై, అంతా చూస్తుండగా జరిగిన హత్య అది. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి అతని కుమారుడు సాయి కుమార్ ఇద్దరూ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో పని చేస్తుండేవారు. మద్యానికి బానిసైన తండ్రి మొగిలి సంపాదించే డబ్బుల్ని తాగుడుకు ఖర్చు పెడుతూ, ఇంట్లో గొడవకు దిగేవాడు. తాగి గొడవ చేయ వద్దని కుమారుడు సాయికుమార్‌ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కుటుంబలోనూ కలహాలు తారస్థాయికి చేరాయి. మానసికంగా వేధిస్తున్న తన తండ్రిని హతమార్చాలకున్న సాయికుమార్ పక్కా ప్లాన్ ప్రకారం తండ్రిని బైక్‌పై వెంబడించాడు. కుషాయిగూడ బస్ స్టాప్ సమీపంలోకి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. ఒకట్రెండుసార్లు కాదు. ఏకంగా 15 సార్లు పొడిచాడు. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

జస్ట్‌ అంతకు కొద్ది రోజుల ముందే మేడ్చల్‌లో పట్టపగలే సొంత అన్నను తమ్ముడితో పాటు వరుసకు తమ్ముడయ్యే మరో వ్యక్తి కత్తులతో పొడిచి చంపేశారు. ఉమేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో తల్లిని కొట్టి వేధిస్తున్నాడని తన అన్నపై కోపం పెంచుకున్నాడు తమ్ముడు రాకేష్. దీంతో మేడ్చల్‌లో ఉంటున్న మరో తమ్ముడు లక్ష్మణ్‌తో కలిసి రోడ్డుపైనే అన్నతో గొడవ పడ్డారు. తనను చంపడానికే వచ్చారని ఫిక్స్‌ అయిన ఉమేష్ వాళ్లిద్దరి నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు పెట్టాడు. అయినా సరే వెంట తెచ్చుకున్న కత్తులతో నడిరోడ్డుపైనే దాడి చేశారు. ఈ దాడిలో ఉమేష్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఆస్తి కోసం తాతను చంపేసిన మనవడు..
హైదరాబాద్‌లో అంతకు ముందు జరిగిన ఓ హత్య.. తెలుగు రాష్ట్రాల్లోనే సెన్సేషన్ అయింది. ఆస్తి కోసం తాతను చంపేసిన మనవడి ఘటన సంచలనం సృష్టించింది. ఉన్నత కుటుంబంలో కూడా ఇలాంటి హత్యలకు మినహాయింపు లేదని ఆ ఒక్క ఘటన చెప్పినట్లయింది. హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలమాటి చంద్రశేఖర జనార్ధనరావును మనవడు కిలారు కీర్తి తేజ దారుణంగా హత్య చేశాడు. తాతను 73సార్లు పొడిచి కడతేర్చాడు. తాత జనార్ధనరావు తనను ప్రతి రోజూ అవమానించేవాడని, ఆ అవమానాలు భరించలేకే చంపేశానని ఇంటరాగేషన్‌లో ఒప్పుకున్నాడు కీర్తితేజ. ముఖ్యంగా తనను బెగ్గర్ అంటూ అవమానించేవాడని చెప్పుకున్నాడు. ఏనాడూ తనను కుటుంబ సభ్యునిగా చూడలేదన్నాడు. చివరికి ఆస్తి కూడా ఇవ్వనని తేల్చి చెప్పడంతో ప్లాన్ ప్రకారమే చంపేసినట్లు ఒప్పుకున్నాడు.

మొత్తానికి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కలతలు, కలహాలు, అనుమానాలు, బయటివారి పట్ల వ్యామోహాల కారణంగా అయినవారని, ఆత్మీయులని, కట్టుకున్నవాళ్లని కూడా చూడకుండా కడతేరుస్తున్నారు. వీటన్నిటికీ కారణం మానవ సంబంధాలు దెబ్బతినడమే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఆస్తులు, అనుమానాలు, ఆర్ధిక లావాదేవీలు, ఇతరత్రా సమస్యల పరిష్కారం చేసుకున్నప్పుడే ఇలాంటి వాటికి చెక్ పడుతుందని చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment