తిరుగుబాట్లు, హింసాత్మక ఘటనలు 80 శాతం తగ్గాయ్: అమిత్ షా
హ్యూమన్ రైట్స్ టుడే/నాగ్‌పుర్: దేశంలో హింసాత్మక ఘటనలు, తిరుగబాట్లు తగ్గుముఖం పట్టాయని కేంద్రం హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ హయాంలో కశ్మీర్‌లోఉగ్రదాడులు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, వామపక్ష తీవ్రవాదం దాదాపు 80 శాతం తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ప్రపంచంలో భారత్‌ను అగ్రస్థానంలో చూడాలన్నదే మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌మత్ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. ఈ సందర్భంగా అమృత్‌కాల్‌లో భాగంగా పెట్టుకున్న మూడు లక్ష్యాలను వివరించారు.
‘‘మోదీ ప్రభుత్వం అధికారంలో రాకముందు దేశంలో అంతర్గత భద్రత ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. కశ్మీర్‌లో ఉగ్రదాడులు జరిగేవి. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉండేవి. ఇప్పుడు అవి దాదాపు 80 శాతం తగ్గుముఖం పట్టాయి. కశ్మీర్ లోయను ఒక్క ఏడాదే దాదాపు కోటీ 80 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. గడిచిన 70 ఏళ్లలో రూ.12 వేల కోట్లు పెట్టుబడులు రాగా.. గడిచిన మూడేళ్లలోనే రూ.12 వేల కోట్లు వచ్చాయి’’ అని షా వివరించారు.
దేశ స్వాతంత్య్రం కోసం సమరయోధుల త్యాగాన్ని ఈ తరానికి తెలియజేయాలన్నదే తమ తొలి లక్ష్యమని అమిత్ షా చెప్పారు. 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజల ముందుకు తీసుకురావడం రెండో లక్ష్యమన్నారు. రాబోయే 25 ఏళ్లలో అన్ని రంగాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడం మూడో లక్ష్యమని చెప్పారు. కశ్మీర్‌లోని ప్రతి ఇంటికి కుళాయి నీరు, విద్యుత్ అందిస్తున్నామన్నారు. వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక చట్టం నుంచి 60 శాతం ప్రాంతాన్ని తప్పించామన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.