అయ్యో.. రూ..! ఎందుకీ టీచర్‌ చదువులు..?

Get real time updates directly on you device, subscribe now.

*’బతకలేక బడి పంతులు’ అనేది ఒకప్పటి మాట.*

*లక్షల్లో బీఈడీ, డీఈడీ నిరుద్యోగులు*

*ఈ ఏడాది టెట్‌కు 4.27లక్షల మంది దరఖాస్తు*

*మొత్తంగా 7లక్షలకు పైగా ఉంటారని అంచనా*

*డీఎస్సీలు వేసినా 2, 3 శాతం మందికే ఉద్యోగాలు*

*ప్రైవేటు స్కూళ్లలో చేరితే చాలీచాలని జీతాలు*

*ఎందుకూ అక్కరకు రాని ఉపాధ్యాయ విద్య*

*అయినా ఏటా టీచర్‌ విద్యకు 35 వేల అడ్మిషన్లు*

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/జనవరి 16: ‘బతకలేక బడి పంతులు’ అనేది ఒకప్పటి మాట. అప్పట్లో టీచర్‌ ఉద్యోగం ఉన్నా వేతనాలు అంతంత మాత్రమే! కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగు పడింది. జీతాలు మాత్రమే కాదు.. సెలవులకు సెలవులు.. ప్రశాంతమైన జీవితం!. ఇది చూసి రాష్ట్రంలో వేల మంది ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఏటా సుమారు 30 వేల మంది బీఈడీ, డీఈడీ చదివి బయటికొస్తున్నారు. అయితే, వారిలో ఎంతమంది ఉద్యోగాలు సాధిస్తున్నారంటే నోరెళ్లబెట్టే సమాధానం తప్పదు! అవును.. కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడంలేదు!!

*అడ్మిషన్లు భారీగా..*

బీఈడీ కోర్సుల్లో 2021-22లో 32348 మంది, 2022-23లో 35748 మంది చేరారు. అలాగే ఏటా సుమారు 2వేల మంది డిప్లొమా ఇన్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(డీఈడీ) కోర్సుల కోసం డైట్‌ కాలేజీల్లో చేరుతున్నారు. వీరిలో 30వేల మందికి పైగా ఏటా ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారు. వారిలో సుమారు5 వేల మంది బయటి రాష్ర్టాల వారుంటున్నారు. ఇలా గత పదేళ్లలో సుమారు 2.5లక్షల మంది రాష్ర్టానికి చెందినవారు టీచర్‌ విద్యను పూర్తిచేశారు. వీరు కాకుండా గతంలోనే బీఈడీ, డీఈడీలు చేసి ఇంకా ఉద్యోగార్హత వయసున్నవారు భారీగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మరోసారి టెట్‌ నిర్వహించగా మళ్లీ 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకంటే ముందే టెట్‌ రాసి అర్హత ఉన్నవారు అనేక మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే సుమారు 7లక్షల మందిపైగా ఉద్యోగ అర్హత వయసున్న బీఈడీ, డీఈడీ చదివినవారు రాష్ట్రంలో ఉన్నారని అంచనా.

*ఆరు శాతం ఉద్యోగాలే..*

ఓవైపు భారీగా టీచర్‌ విద్యనభ్యసించిన వారుంటే టీచర్‌ ఉద్యోగాల భర్తీ మాత్రం ఆ స్థాయిలో లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. అంతకుముందు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 20,532 పోస్టులతో రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు ప్రకటించింది. అంటే మొత్తం నిరుద్యోగుల్లో ఈ పోస్టుల సంఖ్య కేవలం 2.93శాతం మాత్రమే. ఇవి కాకుండా ఏటా పెరుగుతున్న ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఆ సంఖ్య కూడా దాదాపుగా 20 నుంచి 30వేల మధ్యే ఉంటుంది. అంతా కలిపినా గత పదేళ్లలో 6 నుంచి 7శాతం మందికే టీచర్‌ ఉద్యోగాలు లభించాయి. మిగిలిన వారంతా ఖాళీగానే మిగిలిపోతున్నారు. టీచర్‌ ఉద్యోగం ఆశ లేనివారు చిన్నా చితక ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే మెగా డీఎస్సీలో 16,347 పోస్టులున్నాయి. అవి కూడా మొత్తం నిరుద్యోగుల్లో రెండు మూడు శాతం మందికే ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.

*ఒకప్పుడు సీటొస్తే గొప్ప*

ఇప్పుడు ఉద్యోగాలు లేక నామమాత్రంగా మారిన బీఈడీ, డీఈడీ విద్యకు ఒకప్పుడు భారీ డిమాండ్‌ ఉండేది. ఇరవై ముప్పై ఏళ్ల కిందట బీఈడీ సీటు సాధించడం కోసం విద్యార్థులు చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పట్లో బీఈడీ, డీఈడీల్లో సీటు వస్తే ఎంబీబీఎస్‌ సీటు వచ్చినంత గొప్పగా ఉండేది. కాలక్రమంలో కాలేజీలు, సీట్లు భారీగా పెరిగిపోయి బీఈడీ, డీఈడీలకు విలువ తగ్గిపోయింది.

*ప్రైవేటులో జీతం పదివేలే*

ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు కష్టం కావడంతో మిగిలిన వారంతా ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. కానీ, అర్హత కలిగిన టీచర్లు లక్షల్లో ఉంటే ప్రైవేటులో అవకాశాలు మాత్రం అతి తక్కువగానే ఉంటున్నాయి. దీంతో నిరుద్యోగుల మధ్యే పోటీ ఏర్పడి అది ప్రైవేటు పాఠశాలల యాజయాన్యాలకు అవకాశంగా మారుతోంది. అన్ని అర్హతలు, బోధనలో నైపుణ్యం ఉన్నా సగటున టీచర్‌కు నెల జీతం రూ.10వేలే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.7వేలు, రూ.8వేలుకు మించడంలేదు. వీరిలో ఎక్కువగా మహిళలు ఉంటున్నారు. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతి వరకు 3,39,827 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో 57శాతం మంది, ఎయిడెడ్‌లో ఒక శాతం, ప్రైవేటులో 42శాతం మంది ఉన్నారు. అంటే 1,42,750 మంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్యతో పోలిస్తే పోస్టులు తక్కువగా ఉండటంతో ఎప్పటికప్పుడు నిరుద్యోగ రేటు పెరిగిపోతోంది.

*మారనున్న ట్రెండ్‌..*

ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాల్లో ఇప్పుడు ట్రెండ్‌ మారనుంది. కారణం.. ఇప్పటివరకూ బీఈడీ చదివినవారు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకూ అర్హులుగా ఉన్నారు. కానీ 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్జీటీ టీచర్‌ పోస్టులకు బీఈడీలు అర్హులు కారని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసినవారి నుంచి పోటీ తగ్గుతోంది. దీంతో డీఈడీకి పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డైట్‌ కాలేజీల్లో మొత్తం 2వేలకు మించి డీఈడీ సీట్లు లేవు.

*సర్టిఫికెట్‌ కోసం చదివేద్దాం*

బీఈడీ చదివేవారిలో కొంతమంది కేవలం సర్టిఫికెట్‌ కోసం మాత్రమే చదువుతున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కాలేజీకి వెళ్లే పనిలేనందున బీఈడీ చదివేవారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో 396 ప్రైవేటు బీఈడీ కాలేజీలున్నాయి. వాటిలో పట్టుమది పది కాలేజీలు కూడా సక్రమంగా తరగతులు నిర్వహించట్లేదు. దీంతో అడ్మిషన్‌ తీసుకోవడం మళ్లీ ఆ తర్వాత పరీక్షలు రాయడం తప్ప విద్యార్థులు మళ్లీ కాలేజీల ముఖం చూడట్లేదు. అందుకే పొరుగు రాష్ర్టాల విద్యార్థులూ ఇక్కడికొచ్చి బీఈడీ చదువుతున్నారు. అదే కచ్చితంగా రోజూ తరగతులకు హాజరుకావాలనే నిబంధన ఉంటే ఇన్ని అడ్మిషన్లు ఉండవు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment