భారీగా ధరలు పతనంఎకరాకు గరిష్టంగా రూ.లక్షన్నర వరకు నష్టం
హ్యూమన్ రైట్స్ టుడే/గుంటూరు/జనవరి 14: రాష్ట్రంలో మిర్చి రైతులు సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ధరల తగ్గుదలతో మిర్చి సాగు గిట్టుబాటు కాక రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడి పెరగడం, ఆదాయం తగ్గడంతో ఎకరా ఒక్కంటికీ లక్షన్నర రూపాయల వరకూ రైతులు నష్టపోతున్నారు. 2019-20, 2020-21లో సగటు ధర రూ.12 వేలు లభించింది. 2021-22లో రూ.13 వేలు, 2022-23లో రూ.20,500., 2023-24లో రూ.20 వేలు వచ్చాయి. 2024-25లో ఈ ధర రూ.13 వేలకు పతనమైంది. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు గరిష్ట సగటు ధర రూ.13 వేలు దాటలేదు. కరోనా సమయంలో కొంత ఇబ్బంది ఎదురైనా ఆ తర్వాత రెండేళ్లు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే, 2024, 2025లో ధరల పతనం కొనసాగుతోంది. 2022, 2023 సంవత్సరాల్లో మార్కెట్‌లో ధరలు బాగా ఉండడంతో ఇదే తరహాలో ధరలు పెరుగుతాయని ఆశించి రైతులు మిర్చి సాగుపై ఆసక్తి కనబర్చారు. అనూహ్యంగా గతేడాది జనవరి నుంచి ధరలు తగ్గడంతోకోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన సరుకు కదలడం లేదు. 2023తో పోలిస్తే మేలైన రకాలకు క్వింటాలుకు రూ.10 నుంచి 15 వేల వరకు ధర తగ్గింది. మేలు రకాలు బాడిగ, దేవనారు డీలక్సు, తేజ వెరైటీలకు 2022, 2023 సంవత్సరాల్లో గరిష్టంగా రూ.20 వేల నుంచి రూ.28 వేల వరకు ధర పలికింది. గత ఏడాది, ఈ ఏడాది సగటున రూ.10 వేల నుంచి రూ.15 వేలు తగ్గింది. ఎకరాకు సగటున పది క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుందని అంచనా. ధర తగ్గడంతో ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రైతులకు నష్టం వస్తోంది. గతేడాది ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీల్లో 18 లక్షల టిక్కిల మిర్చి నిల్వ ఉంది. ప్రస్తుతం రాయలసీమతో, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజుకు 40 వేల నుంచి 60 వేల టిక్కిలు వస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న సరకు అమ్ముడుపోక, కొత్త సరకుకు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు రెండేళ్ల క్రితం కనీసం లక్షన్నర వరకు లాభాలు వచ్చేవి. 2014లో ఎకరాకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. 2015లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎగుమతి ఆర్డర్లు తగ్గాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా మిర్చి సాగు పెరిగిందని, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెబుతూ గత కొంతకాలంగా మిర్చి ధరలను వ్యాపారులు తగ్గిస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ధరలు మరింత తగ్గాయి. గరిష్ట ధర మేలు రకాలకు రూ.15 వేలు, సాధారణ రకాలకు రూ.13,500 మాత్రమే వస్తోంది. పేరెన్నిక స్పెషల్ వెరైటీలు తేజ, బాడిగ ధరలు కూడా భారీగా తగ్గాయి. తేజ కనిష్ట ధర రూ.7,500, గరిష్ట ధర రూ.15,500 మాత్రమే లభిస్తోంది. బాడిగ కనిష్ట ధర రూ.7,500, గరిష్ట ధర రూ.13,500 వస్తోంది. దేవనారు డీలక్స్ కనిష్టం రూ.8,500, గరిష్టం రూ.15 వేలు మాత్రమే లభిస్తోంది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న సరుకు ధరలు ఇంకా తగ్గుతున్నాయి. ధరల పతనంపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి సమీక్షా చేయలేదు. గిట్టుబాట ధర కల్పించి తమను ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.