చచ్చినా.. తగ్గేదే లే!

Get real time updates directly on you device, subscribe now.


పందెంలో వీర మరణం పొందిన పుంజులకూ గిరాకీ..

బరుల వద్ద మాంసాహార ప్రియుల కోలాహలం..

పండక్కి వచ్చిన బంధుమిత్రులకు వడ్డించేందుకు తహతహ..

నేతలు, పోలీసులు, అధికారులకు మామూళ్లతో పాటు కానుకగా ‘కోజ’లు..

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /జనవరి 14: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్‌ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా.. మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్‌ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.

పుష్టికరమైన ఆహారం..

పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి.

ప్రత్యేకమైన రుచి..

పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని
మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు.

బంధుమిత్రులకు వండి పెట్టి..

కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు.

‘పెద్దలకు’ కానుకగా..

సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్‌ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్‌ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు.

కోట్లు కురిపిస్తున్న ‘కోజ’
‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment