మళ్లీ ఎగిరొచ్చిన చీతాలు.. దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్ చేరుకున్న విమానం
హ్యూమన్ రైట్స్ టుడే/గ్వాలియర్: దాదాపు 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి చీతాలు ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికా తో ఒప్పందంలో భాగంగా 12 చీతాలు శనివారం భారత్ చేరుకున్నాయి. ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్ నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు.
ఈ మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటి కోసం కునో పార్కులో పది క్వారంటైన్ ఎన్‌క్లోజర్లను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం.. నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్‌లో ఉంచనున్నారు.
1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. గతేడాది సెప్టెంబరు 17న తన పుట్టినరోజున ప్రధాని మోదీ స్వయంగా వీటిని పార్కులో విడిచిపెట్టారు. వీటి సంఖ్యను పెంచుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవల దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతలో భాగంగా 12 చీతాలు నేడు దేశానికి చేరుకోగా.. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.