‘పెద్ద ప్రభావమేమీ ఉండదు..’ ఎన్నికల గుర్తుపై ఉద్ధవ్‌తో శరద్ పవార్!
హ్యూమన్ రైట్స్ టుడే/ముంబయి: శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివసేన(యూబీటీ) వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈసీ వ్యవహార తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని విమర్శించారు. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. పార్టీ ఎన్నికల గుర్తు కోల్పోవడంతో పెద్ద ప్రభావమేమీ ఉండదని తన మిత్రపక్షం ఉద్ధవ్ వర్గంతో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అంగీకరించి, కొత్త గుర్తును తీసుకోవాలని ఠాక్రేకు సూచించారు. కొత్త గుర్తును ప్రజలు అంగీకరిస్తారని కూడా ఆయన చెప్పారు.
‘కాంగ్రెస్ కూడా మార్చుకుంది..’
‘ఇది ఎన్నికల సంఘం నిర్ణయం. ఒకసారి నిర్ణయం వెలువడ్డాక చర్చలకు తావులేదు. దానిని శిరసావహించండి. పాత గుర్తును కోల్పోవడంతో పెద్దగా ప్రభావం ఉండదు. ప్రజలు కొత్త ఎన్నికల గుర్తును ఆమోదిస్తారు. ఈ విషయం ఓ 15- 30 రోజులపాటు చర్చలో ఉంటుంది, అంతే’ అని పవార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ సైతం ‘జోడెద్దులు- కాడె’ నుంచి ‘హస్తం’ గుర్తుకు మార్చుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసిన శరద్ పవార్.. అదే విధంగా శివసేన(యూబీటీ) కొత్త గుర్తునూ ప్రజలు అంగీకరిస్తారని తెలిపారు. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. గత ఏడాది అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈసీ దీనిని కేటాయించింది.
సుప్రీంకోర్టు కు ఉద్ధవ్
ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ శిందే వర్గానికి శివసేన పేరు, గుర్తును కేటాయించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకుగానూ ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందేకు మద్దతివ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత భాజపా ఎమ్మెల్యేల మద్దతుతో శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం రెండు వర్గాలు పోటీపడ్డాయి.