కబీర్ స్మృతి దివస్ సందర్భంగా..

Get real time updates directly on you device, subscribe now.

జనవరి 2 వ తేదీ కబీర్ స్మృతి దివస్ సందర్భంగా వినయపూర్వక నమస్సులు.

హ్యూమన్ రైట్స్ టుడే:
సంత్ కబీర్ దాస్ గొప్ప జ్ఞాని ,ప్రవక్త. ఆధ్యాత్మిక విప్లవకారుడు.కబీర్ దాస్ బోధనలు ఆచరించేవారు ఎంతటి కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటారు.పట్టుదలతో తమ జీవితాలను సమాజ హితం కోసం తానెంత బాధలు పడినా సమాజహితం కోసమే జీవిస్తారు.

పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యః
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారాయ సతాం విభూతయః

వృక్షాలు ఫలించేది పరులకు ఉపకారం చేయడానికి,నదులు ప్రవహించేది పరులకు ఉపకారం చేయాడానికే,గోవులు పాలిచ్చేది  పరులకు ఉపకారం చేయడానికే,పరులకు ఉపకారం చేయడానికే సజ్జనుల సంపద ఉపయోగపడుతుంది. అని కబీర్ మన జీవితాన్ని సమాజం కోసం ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలి అని అన్నారు.కబీర్ ప్రేమ తత్వాన్ని ప్రబోధించారు. సమాజంలో మనుషులకు ప్రేమ అనేది లేకపోతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అలవడదని కబీర్ అన్నారు. ఖర్జూరం చెట్లు ఎంత పొడవుగా పెరిగినా అవి బాటసారులకు నీడను ఇవ్వవు.తెంచుకోవడానికి పండ్లను ఇవ్వదు.అదేవిధంగా ప్రేమను పంచని సమాజం వలన ఉపయోగం లేదని కబీర్ అన్నారు. ప్రేమ ఒక్కటే విషాన్ని అయినా అమృతం వలె మార్చగలదని కబీర్ అన్నారు.

వృక్ష్ కబహు న ఫల్ బఖై
నదీ న సంచై నీర్
పరమారథ్ కే కారనే
సాధున్ ధరా శరీర్

వృక్షానికి కాసిన తన పండ్లు మరొకరికి ఇవ్వడానికే కానీ తాను ఏ విధంగా అయితే తినలేదో,అలాగే నదిలోని నీళ్ళను తాను తాగలేనట్లే ఇతరులకు మంచి చేయడానికే తప్ప తాను కూడబెట్టుకోదు కదా .అదేవిధంగా సాధువులు,సజ్జనులు,సత్పురుషులు  పరులకు మేలు చేయడానికే శరీరాన్ని ధరిస్తారు.మహాపురుషులు ఎప్పుడూ సమాజం కోసమే జీవిస్తారని కబీర్ తెలుపుతున్నారు.

సంత్ కబీర్ జననం:

కబీర్ కాశీలో క్రీ.శ.1399/1440 లో జన్మించినట్లుగా తెలుస్తోంది..క్రీ.శ.1518 లేదా 1494లో నిర్యాణం చెందారు.కొందరు చరిత్ర కారులు ప్రకారం కబీర్ క్రీ.శ.1318 లో జన్మించి,1448 లో మరణించినట్లు చెబుతున్నారు.కబీర్ తల్లిదండ్రులు ఎవరో తెలియడం లేదు.ఒక నిరుపేద చేనేత ముస్లిమ్ దంపతులు అయిన నీమా, నీరూ లు కబీర్ ను పెంచి  పెద్దచేశారు.నిరుపేద కావడం వలన కబీర్ పేదరికాన్ని అనుభవించాడు.

కబీర్ కాలంలో పరిస్థితులు :

కబీర్ కాలంలో ఉత్తర భారత దేశంలో బ్రాహ్మణ భావజాలం విపరీతంగా వ్యాప్తి చెంది ఉంది.ఎక్కడ చూసినా మత కలహాలు..హిందూ ముస్లిం ల మధ్య విద్వేషాలు రగులుతున్న సమయం అది,మరో పక్క మూడ నమ్మకాలు సమాజంలో వ్యాప్తి చెందాయి.ఇలాంటి నేపధ్యంలో కబీర్ ఇల్లు విడిచి దేశాటన చేస్తూ వివిధ వ్యక్తులను కలిసి జ్ఞాన సముపార్జన చేసాడు.పెద్దగా చదువుకోలేదు కబీర్ ఆయన బోధించిన తత్వాలను ఆయన శిష్యులు గ్రంథస్తం చేసారు.ఆనాడు సమాజంలో సవర్ణ హిందువులు దళితులను ఆలయాలలోకి రానిచ్చేవారు కాదు.ఈ అమానుష త్వాన్ని సంత్ కబీర్ ఖండించారు.అందుకే కబీర్  దోహా(కవితలు) లో ఇలా అన్నారు : దేవీదేవతల దర్శనం కోసం ప్రాకులాడకండి. నీ మార్గ మధ్యంలో ఎవరైనా ఛండాలురు ఎదురైతే వారినే దైవ దర్శనం లాగ భావించండి.”
కబీర్ దాస్ అసమాత్వాన్ని పెంచి పోషించే అద్వైత మఠాలను, హిందూ సన్యాసులను నిరంతరం తీవ్రంగా వ్యతిరేకించేవారు.కబీర్ దాస్ విగ్రహారాధనకు, పూజలు, క్రతువులకు వ్యతిరేకి.సమాజంలోని ముల్లాలు, పూజారులే పాలకులు యొక్క ఆలోచనలు ప్రభావితం చేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి అందులో భాగస్వామ్యం ఉండదు అని కబీర్ అన్నారు.

బ్రాహ్మణ ధర్మం బారిన పడ్డ జనం కర్మ సిద్ధాంతాన్ని అనుసరించేవారు.జనం జ్ఞానం వైపు సత్యం వైపు చూడకుండా పీడితులుగా ఉండేవారు.కబీర్ దాస్ ప్రజలను బుద్ధి జీవులుగా మార్చడానికి హేతువాదం వైపు మరల్చడానికి చాలా శ్రమించారు.కాశీలో మరణించిన వారు స్వర్గానికి పోతారనే అంధ విశ్వాసాన్ని కబీర్ ఖండించారు. ఇదే నిజమైతే దేవునికి పూజలు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. కబీర్ కర్మ సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని మోక్షానికి సాధనగా చెప్పడాన్ని విమర్శించారు.

కబీర్ రాముడు భక్తుడు కాదు.

కబీర్ రాముడు అనే పదం వాడినందుకు మనువాదులు కబీర్ ను రాముని భక్తునిగా చెప్పారు.కబీర్ తన రచనలలో ప్రజల భాష వాడారు.సామాన్యులకు అర్థం అయ్యే విధంగా భాష ఉండేది.అందుకే చాలా కాలం కబీర్ రచనలను మనువాదులు పట్టించు కోలేదు.కబీర్ రాముని భక్తుడు అని ప్రచారం చేసారు.వాస్తవానికి ఆయన రాముని భక్తుడు కాదు. ఆ విషయాన్నికబీర్ వ్రాసిన “బీచక్” అనే పుస్తకంలో ఒక “దోహా’ ఉన్నది అందులో కబీర్ రాముడును నాలుగు రకాలుగా చూసాడు. ఒక రాముడు దశరథుని కుమారుడు.రెండో రాముడు అన్ని చోట్లా ఉన్నాడు .మూడో రాముడు మనసులో ఉన్నాడు.నాలుగో రాముడు సర్వాంతర్యామి అంటే అతనికి రూపం లేదు.

కబీర్ వాడిన రామ్ అనేది నిర్గుణుడైన దేవుడికి పెట్టిన పేరు అది.కబీర్ ను అనుసరించే వాళ్ళు అలాగే దళితులు పెట్టుకొనే తమ పేర్లలోని రామ్ అనేది హిందూ మతంలోని రాముడు కాదు.సంత్ కబీర్ దాస్ , సంత్ రవిదాస్ యొక్క బోధనల ప్రభావంతో వాడే పేర్లు మాత్రమే. బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ పేరులోని రామ్ జీ కానీ తన తండ్రి పేరు రామ్ జీ సక్పాల్ లోని రామ్ పదాలు కబీర్ దాస్ బోధనల  ప్రభావంతో పెట్టుకన్నవే.

కబీర్ దాస్ రచనలు : కబీర్ రచనా శైలి సరళంగా ఉంటుంది. తన కవిత్వం కూడా సంక్షిప్తంగా ఉంటాయి. ప్రజల యొక్క భాషలైన అవధా, బ్రజ్, భోజ్ పురి భాషలలోనూ,హిందీ భాషలోనూ కబీర్ రచనలు చేశారు.కబీర్ బిజక్, కబీర్ గ్రంథ వారీ, అనురాగ్ సాగర్, సాఖి గ్రంథ్ మొదలైన రచనలు చేశారు.ఇవి పలు భాషల్లోకి అనువదించబడ్డాయి.ఈ రచనలు తెలుగులో లభిస్తే బాగుణ్ణు.


కబీర్ సిద్ధాంతం – డా.అంబేడ్కర్ పై కబీర్ ప్రభావం:

బోధిసత్వ అంబేడ్కర్ కు ముగ్గురు గురువులు.ఒకరు ఆది కాలంలోని తథాగత గౌతమ బుద్ధుడు,మధ్య కాలంలోని సంత్ కబీర్, ఆధునిక కాలంలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలేలు.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి కుటుంబం కబీర్ బాటలో నడిచింది.అంబేడ్కర్ తండ్రి ఆధ్యాత్మిక వాది.ఆయన కబీర్ తత్వాలు పాడేవారు.కబీర్ ప్రభావం అంబేడ్కర్ గారిపై కూడా ఉంది.సంత్ కబీర్ దాస్ బోధనలను ఆచరిస్తూ డా.అంబేడ్కర్ కుటుంబం భజనలు చేస్తుండేవారు.కబీర్ అన్ని మత గ్రంథాలను నమ్మవద్దని చెప్పారు. కబీర్ నిర్గుణ వాద సిద్ధాంతం బోధించారు. ఇది నాస్తికత్వానికి దగ్గరగా ఉంటుంది.కబీర్ నరకం, స్వర్గం, జన్మ, పునర్జన్మ, మోక్షం, అవతారం, పూజలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన, ఉపవాసం మొదలైన భావనలను తిరస్కరించారు.కబీర్ నిర్గుణ వాద సిద్ధాంతం ప్రబోధించారు.అందుకే కబీర్ పట్ల అంబేడ్కర్ ఆరాధనా భావాన్ని పెంచుకున్నారు.
నాటి సమాజంలో భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, శిక్కు ఉద్యమం వంటి ఉద్యమాలు అన్నీ దేవుడు చుట్టూ, మూఢనమ్మకాలు చుట్టూ తిరుగుతూ ఉండేవి.అయితే కబీర్ నడిపిన భక్తి ఉద్యమం దేవుడు చుట్టూ తిరగలేదు.కబీర్ మార్గం హేతువాద సహితంగా,తర్క బద్ధంగా ఉండేది. కబీర్ దృష్టిలో ‘దైవ ద్రోహులు ఎవరంటే ప్రజలను మూఢనమ్మకాలలో ముంచి, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, పూజలు, భజనలు, నమాజ్ పేరిట దోపిడీ చేసే ముల్లాలు, పూజారులు మొదలైన వాళ్ళు.’ కబీర్ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, వర్తకులు, దోపిడీ దారులు వీళ్ళు బోధించేదానికి, ఆచరించే దానికి ఏమాత్రం సంబంధం లేదని కబీర్ చెప్పేవారు. నాటి సమాజంలో ఇంతటి భావ ప్రకటన
విప్లవాత్మకమైనది.మేధోపరంగా ప్రజలు ఆలోచించాలి అని కబీర్ చెప్పేవారు.అందుకే కబీర్ డా.అంబేడ్కర్ కు గురువుగా ఆదర్శంగా నిలిచారు.సంత్ రవిదాస్ యొక్క శిష్యుడు సంత్ కబీర్. అద్వైత సిద్ధాంత ప్రతారకుడు రమణానంద గురువు వద్ద మొదట్లో కబీర్ అభ్యాసం చేసినప్పటికీ కబీర్ అద్వైత సిద్ధాంతాన్ని అధిగమించారు.సంత్ కబీర్ కు అన్ని మతాలలోనూ అనుచరులు ఉండేవారు.

“దేవునికి లేని కులం అతని బిడ్డలైన మానవులకెలా వచ్చింది.” అని కబీర్ తర్కంతో ప్రశ్నించారు.బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా కులవ్యవస్థపై పోరాటం సాగించారు. బాబాసాహెబ్ కూడా తర్కంతోనే ఛాందస మనువాదులను ప్రశ్నించారు.క్రీ.శ 15 వ శతాబ్ధంలో వారణాసి ప్రాంతంలో బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా నాడు మాట్లాడటం అంటే ఎంతో ధైర్యం కావాలి.కబీర్ ఆనాడు బ్రాహ్మణ అసమాన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి.నాడు బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా సాగిన భక్తి ఉద్యమం నిజానికి ఇది భక్తి ఉద్యమం కాదు బ్రాహ్మణ భావజాల వ్యతిరేక ఉద్యమం అని చెప్పాలి .ఈ కోవలోకే సంత్ కబీర్ వస్తారు .కబీర్ ఎప్పుడూ తన జీవిత కాలంలో బ్రాహ్మణిజానికి లొంగి పోలేదు.కబీర్ గొప్ప మానవతావాది. మనువాదులు ఎప్పుడూ కూడా మహనీయులను నిర్లక్ష్యం చేయడం,అసలు వాళ్ళ ప్రస్తావన కూడా లేకుండా జాగ్రత్త పడడం ,మహనీయులు ఒకవేళ వాళ్ళ కులం వాళ్ళు అయితే మా వాడే అని చెప్పి అతని అసలు చరిత్రను వక్రీకరించి చెప్పడం , అలాగే పూజ చేయడం ద్వారా ఆ మహనీయుడు దేనికి వ్యతిరేకంగా పోరాటం చేసారో దాన్ని సమాధి చేయడం చేస్తుంటారు.ఈ నాలుగు దశలలో ఈ దేశంలో గల మహనీయులను చిత్రీకరించి వాళ్ళ ఆశయాలను ,వాళ్ళ అసలు చరిత్రను లేకుండా చేయడం మనువాదులకు వెన్న తో పెట్టిన విద్య.కబీర్ తల్లిదండ్రులు నుంచి వచ్చిన చేనేత వృత్తిని చేపట్టారు. ఊరికే కాలక్షేపం ఎక్కడా చేయలేదు. కష్టించే స్వభావం గల కబీర్ తన తత్వాన్ని శ్రమ నుంచి తీసుకుని బోధించారు.

నాటి చరిత్రలో జరిగిన సంఘటనలు ఆశువుగా మాత్రమే ప్రచారంలో ఉండేవి.ఇలాంటి నేపథ్యం లో బ్రాహ్మణ మనువాదులు చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరించి అదే అసలు చరిత్ర గా చేసారు.అందుకే భక్తి ఉద్యమం పేర అసలు చరిత్రను వక్రించి చూపారు .మనువాదం లక్ష్యం మనల్ని గందరగోళంలోకి నెట్టడం తద్వారా వారి దోపిడీ కొనసాగించడం అసలు కిటుకు అందుకే వాళ్ళు దేవుడు ,మహత్యాలు కల్పిత కథలు చొప్పిస్తారు తమ రచనల నిండా…మన దేశంలో మహనీయులను పూజ చేయడం తద్వారా వాళ్ళ అసలు లక్ష్యాలను పక్క దారి పట్టించడం మనువాద ఆలోచన .కాబట్టి మనం మహనీయులను పూజ చేయడం కాదు వాళ్ళ ఆశయాలను సాధించే బాట పట్టాలి.మనకు ప్రశ్నించే లక్షణం లేదు.మనకు ప్రశ్నించే లక్షణం వచ్చినప్పుడే మన దేశంలో అసలైన మార్పు వస్తుంది.కబీర్ తన దోహా లో ఎక్కువగా ప్రశ్నించే ధోరణితో మనకు జ్ఞానం కలిగించే విధంగా ఉంటాయి.

“పుస్తకాలు చదవడం వలన పండితులు కారు.దయ,ప్రేమ తో కూడిన రెండక్షరాలు చదివిన నాడే నువ్వు పండితుడువు అవుతావు.”

“వ్రాత పూర్వకంగా ఉన్న మాటలు కాదు కళ్ళకు కనబడ్డవి నేను చెబుతాను అంటారు”  –కబీర్

👉కొన్ని కబీర్ సూక్తులు చూద్దాం…

“గనులలో దొరికే మణులు కంటే మంచితనం అనే గుణమే నిజమైన మణి.”

“చేసే పనే దైవం,బాధ్యతే మతం.”

“గురువు,దైవం ఇద్దరూ ఒకేసారి కనిపిస్తే నేను గురువుకే ముందుగా నమస్కరిస్తాను.”

“మతాల పేరిట సామరస్యం చెడగొట్టుకోవటం అవివేకం.”

“రామ్ రహీమ్ ఏక్ హై”

“భగవంతుని కొరకు అక్కడ – ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు..నీలో వున్న ఆత్మా రాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభి నుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు.”

కల్ కరీసో ఆజ్ కర్ ఆజ్ కరీసో అబ్
        – సంత్ కబీర్ దాస్

“రేపు చేయాల్సింది ఇవ్వాల్నే చేయుము, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేయమని” కబీర్ ఉపదేశించారు.

“నీ కులమేమిటని ఎవరూ అడగకండి.దేవుణ్ణి పూజించే అందరూ దేవునికి చెందిన వారే.”

“పరుల కోసమే జీవించాలి.”
                                   కబీర్

భగవాన్ బుద్దుడిని సకల రాజభోగాలు,ఐశ్వర్యం ఆపలేదు, సంత్ కబీర్ ను పేదరికం ఆపలేదు, పరోపకారిగా ఉండుటకు,జ్ఞానాన్ని బోధించడానికి ఐశ్వర్యం,పేదరికం అడ్డుగోడలు కావు.

“గురువు,దైవం ఇద్దరూ ఒకేసారి కనిపిస్తే నేను గురువుకే ముందుగా నమస్కరిస్తాను.” అన్న కబీర్ నిజంగానే గొప్ప గురువు.

కబీర్ దాస్ ఇలా ప్రబోధించారు : “ఈ ప్రపంచంలో మనుషులలో చెడును వెతకడానికి నేను వెళ్ళినప్పుడు, నేను ఎక్కడా ఒక చెడ్డ వ్యక్తిని కనుగొనలేదు, చూడలేదు.అప్పుడు నేను నా మనసు లోపలికి చూసినప్పుడు, ఈ ప్రపంచంలో నా కన్నా అధ్వాన్నంగా మరొకరు లేరని నేను కనుగొన్నాను అంటే, ఇతరులలో చెడును కనుగొనే ముందు మనం మనలోనే ఉన్న చెడును కూడా చూసుకోవాలి, అప్పుడు మనకన్నా దారుణమైన వ్యక్తి ఈ ప్రపంచంలో లేడని మనకు తెలుస్తుంది.”

సంత్ కబీర్ దాస్ ‘రాతిలో దేవుడు ఉండడు,రాయిని పూజించడం పాపమని’ చెబితే, ప్రజలు కబీర్ ను దేవుడు అంటూ కబీర్ యొక్క రాతి విగ్రహం చేయించి,కబీర్ ను పూజించడం ప్రారంభించారు. కబీర్ దేనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారో, కబీర్ ఆశయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆయణ్ణి దేవడంటూ పూజించడం చేస్తున్నారు.సంత్ కబీర్ తథాగత బుద్ధుని సైద్ధాంతిక విప్లవ వారసత్వాన్ని ముందుకు నడిపారు.ఉత్తర భారతదేశంలో కబీర్ ను అనుసరించే వారున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కబీర్ ను అనుసరించే వారు లక్షల్లో ఉన్నారు.సమారు పది లక్షల మంది కబీర్ పంతీలు కబీర్ ఆశయాలను అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు.మూఢనమ్మకాలు వదిలి, వాస్తవం మీద ఆధారపడి జీవించాలి అనే వాళ్ళు కబీర్ ను,ఆయన రచనలను అధ్యయనం చేయాలి. కబీర్ ను అధ్యయనం చేయడం వలన మనకు నూతనోత్తేజం కలుగుతుంది. అంధ విశ్వాసాల నుండి బయట పడతాం.హేతువాదం వైపు అడుగులు వేయగలుగుతాం.బాబాసాహెబ్ డా.అంబేడ్కర్  యొక్క అనుచరులు కబీర్ రచనలు తెలుగులోకి వచ్చేలాగ కృషి చేయాలి కబీర్ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి.

అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది

మంచిని పెంచు – చెడును త్యజించు.


భవతు సబ్బ మంగలమ్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment