రాష్ట్రంలో గందరగోళంగా ఉన్న విద్యావ్యవస్థను పట్టించుకోని రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి వద్ద విద్యాశాఖ ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు!
ఏ ఐ ఎఫ్ డి ఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ డిసెంబర్ 30: ఏ ఐ ఎఫ్ డి స్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి అధ్యక్షతన (తేది: 30-12-2024) ఓంకార్ భవన్ బాగ్ లింగంపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉన్న చందంగా తయారయ్యిందని, గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయడంలో వైఫల్యం చెందిన విషయాలను కాంగ్రెస్ పార్టీ ఆసరాగా తీసుకొని ఎన్నికల సమయంలో మరియు వివిధ సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తే సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగిందని, విద్యార్ధి, యువత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రమైన కృషి చేశారని, ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారని, విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడని, కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి అవుతున్న కూడా విద్యా రంగంలో ఉన్న సమస్యలపై ఇంతవరకు ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించని పరిస్థితిలో ఉన్నారని, సాక్ష్యాత్తు విద్యాశాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉండటం వలన రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అందరూ భావించారని, కానీ నేడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టు మిట్టాడుతున్నారని, గురుకులాల్లో ఉన్న విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురైతున్నారని, అద్దెభవనాలలో కొనసాగుతున్న వాటికి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో వారు వాటికి తాళాలు వేయడం జరిగిందని, విద్యార్థులు స్వచ్చందంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న అధికారుల్లో చలనం కూడా లేదని, సాంఘిక, సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చూపకపోవడం, నాణ్యతతో కూడిన భోజనం పెట్టకపోవడంతో అనేక మంది విద్యార్థులు అనారోగ్యబారిన పడటం, ఇవన్ని సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.
ఆదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు 7,800 కోట్లు బకాయిలు మూడు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. తమ కోర్సులు పూర్తి అయినా కూడా కళాశాల యాజమాన్యాలు తమ యొక్క ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో వారు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని, కావున రేవంత్ రెడ్డి తక్షణమే విద్యారంగoపై సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కారం చేయాలని తెలియజేయడం జరిగిందని, లేని పక్షంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వస్కుల మట్టయ్య రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు వస్కుల భరత్ ఎండి మోసిన్ కోశాధికారి పోతుగంటి కాశి కమిటీ సభ్యులు మార్త నాగరాజ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.