తెలంగాణ‌లో సామాన్యుల భూహ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ – భూభార‌తి

Get real time updates directly on you device, subscribe now.

అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 19: తెలంగాణ‌లో సామాన్యుల భూహ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ – భూభార‌తి చ‌ట్టాన్ని రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. బుధ‌వారం శాస‌న‌స‌భ‌లో మంత్రి భూభార‌తి బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి అద్భుత‌ చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం త‌న‌కు ల‌భించ‌డం మ‌ర‌చిపోలేని విష‌య‌మ‌ని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆర్వోఆర్ చ‌ట్టం 49 ఏళ్ల‌పాటు ఉప‌యోగ‌ప‌డింద‌ని, ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్ర‌జోప‌యోగంగా ఉప‌యుక్త‌మ‌య్యింద‌ని తెలిపారు. త‌ర్వాత అర్ధ‌రాత్రి నాలుగు గోడ‌ల న‌డుమ రూపొందిన ధ‌ర‌ణి చ‌ట్టం వ‌ల‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా ల‌క్ష‌లాది స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింద‌ని చెప్పారు. కొండ‌ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలిక ఊడింద‌న్న‌ట్లు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో లెక్క‌లేన‌న్ని ఇబ్బందులు ఎదురయ్యాయ‌ని వివరించారు. లోక్‌స‌భ‌లో ప్ర‌తిపక్ష‌నేత రాహుల్ గాంధీ, నాటి ప్ర‌తిప‌క్ష‌నేత, నేటి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, నేటి ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌మ పాద‌యాత్ర‌ల సంద‌ర్బంగా ధ‌ర‌ణిని అరేబియా సముద్రంలో క‌లుపుతామ‌ని ఇచ్చిన హామీని ప్ర‌జ‌లు విశ్వ‌సించార‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆమేర‌కు ఇందిర‌మ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నార‌ని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా త‌మ‌ను న‌మ్మార‌ని, వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసి భూభార‌తిని రూపొందించామ‌ని చెప్పారు.  తాము ఆగ‌స్టు 2న ముసాయిదాను ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మేగాక ప్ర‌త్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌లో పెట్టి ప్ర‌జాప్ర‌తినిధులు, క‌వులు, మేధావులు, విశ్రాంత అధికారుల స‌ల‌హాలు సూచ‌న‌లు స్వీకరించి కొత్త చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేశామ‌ని తెలిపారు. మాజీ మంత్రి హ‌రీష్ రావు 7 పేజీలు, వినోద్‌రావు 5 పేజీల స‌ల‌హాలు. సూచ‌న‌లు చేశార‌ని వాటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. 33 జిల్లాల‌లో ఒక్కోరోజు ప్ర‌త్యేక చ‌ర్చావేదిక‌లు నిర్వ‌హించి అంద‌రి అభిప్రాయాలు తీసుకున్నామ‌ని చెప్పారు. 18 రాష్ట్రాల‌లోని ఆర్వోఆర్‌ల‌ను అధ్య‌య‌నం చేసి ఉత్త‌మ విధానాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి వాటిని భూభార‌తిలో పొందుప‌రిచామ‌ని మంత్రి తెలిపారు.

ధ‌ర‌ణి కార‌ణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని, కేస‌ముద్రం మండ‌లం నారాయ‌ణ‌పురంలో కె. ర‌వి అనే ఎంపీటీసీ స‌భ్యులు భూ స‌మ‌స్య‌ల‌ను బిఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌లంద‌రి దృష్టికి తీసుకువెళ్లార‌ని, ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాలేద‌ని చెప్పారు. అంతేగాక స‌ర్వేనెంబ‌ర్లు 149,150, 154,156, 168 త‌ద‌త‌రాల్లోని 1398 ఎక‌రాల భూమి త‌ర‌త‌రాలుగా అక్క‌డి గిరిజ‌నుల సాగుబ‌డిలో ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ధ‌ర‌ణి -2020 ఆర్వోఆర్ చ‌ట్టం వ‌చ్చాక వారి హ‌క్కుల‌కు భంగం వాటిల్లేలా స‌ద‌రు భూములు అట‌వీ భూముల‌ని తేల్చిచెప్పార‌ని దీంతో గిరిజ‌నులు తీవ్ర మ‌నోవేద‌న‌న‌కు గురయ్యార‌ని మంత్రి వివ‌రించారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో 4 నెల‌ల పాటు రిజిస్ట్రేష‌న్‌లు ఆపివేశార‌ని, దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్లు, చ‌దువుల కోసం ఖర్చుచేద్దామ‌నుకొనే సామాన్య రైతుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగింద‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.

భూభారతి బిల్లుకు సంబంధించి 22-23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామ‌ని, అందువ‌ల్లే బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంలో జాప్యం జ‌రిగింద‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్ర‌జల‌కు పూర్తిస్ధాయిలో ఉప‌యోగ‌ప‌డేలా బిల్లు త‌యారుచేసేందుకు కృషి చేశామ‌ని, సాదాసీదా బిల్లును ప్ర‌జ‌ల‌పై రుద్దే ఆలోచ‌న త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

• భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి, భూమికి విడదీయరాని అనుబంధం ఉంది.  భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది. ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం.
• భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది.
• ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1971లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏండ్లు విజయవంతంగా అమలైంది.
• ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ లాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
• కాంగ్రెస్ అంటేనే ప్రజలకు ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు.
• కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ఆర్వోఆర్ చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో మూడేండ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి.
• ఉన్న నాలికకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది.
• రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావాల్సినవి కోర్టుల దాకా వెళ్ళాల్సి వచ్చింది.
• నాలుగు గోడల మధ్య కూర్చుని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా మన నెత్తిమీద రుద్దారు.                              ధరణి  మానవ సంబంధాలను సైతం దెబ్బతీసింది.*
*మనుషుల మధ్య దూరాన్ని పెంచింది.      
• భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళకింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదనను చెప్పుకోడానికీ మార్గం లేకుండా చేసింది.
• అందుకే మా నాయకుడు రాహుల్‌గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణిని అరేబియా మహా సముద్రంలో వేస్తామని హామీ ఇచ్చారు. మా హామీని తెలంగాణ ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారి నాయకత్వంలో మా సహచర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు భూ-భారతిని తీసుకొస్తున్నాం.
• ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్‌రెడ్డి గారి సూచన మేరకు ధరణి కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేకసార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేసింది.
• ఆనాటి దొరలు గడీల్లో కూర్చుని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్టు బిల్లును ఇదే అసెంబ్లీలో ఆగస్టు 2న ప్రవేశపెట్టాం.
• ప్రజల నుంచి చట్టం రావాలనే ఉద్దేశంతో అదే రోజున సీసీఎల్ఏ వెబ్‌సైట్‌లో కూడా ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచాం. దాదాపు పాతిక రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, రైతుసంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాన్య ప్రజానీకం, రిటైర్డ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాం. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించారు.
• చివరకు 2020 చట్టంలో ప్రధాన పాత్ర పోషించిన తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచనలు కూడా స్వీకరించాం. ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.
• ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సభలో భూ-భారతి బిల్లును ప్రవేశపెడుతున్నాం.
*ప్రధానాంశాలు*
• గత చట్టం (2020)లోని తప్పులను అధ్యయనం చేసి భూ-భారతి ద్వారా సరిదిద్దడం.
• (ఏ) పార్టు-బీ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం.
• (బి) గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు పరిష్కారం.
• (సీ) భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం.
• రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తున్నాం.
• ధరణిలో కొసమెరుపు : ఏదైనా పనికొచ్చేదున్నదంటే… రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటే. కానీ దురదృష్టవశాత్తూ తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు.
• వారసత్వం… వంశపారంపర్య భూములు..
• సేల్ డీడ్, వారసత్వం … కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ను ఆర్డీవో ….
• సాదా బైనామా … : 2020 నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం…
• భూధార్ : దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నంబర్…
• జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులు : 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తాం. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాం. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది.
• ల్యాండ్ ట్రిబ్యునల్స్: భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు… అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వ నిర్ణయం…
• సీసీఎల్ఏ ద్వారా రివిజన్: ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరుస్తున్నాం.
• ప్రభుత్వ అధికారులపై చర్యలు: ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై  చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నాం.
   
*అనుభవదారుడు / ఖాస్తు కాలం:*
2014 కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉంది అనుభవదారుడిగా పొసిషన్ లో ఉన్న వారు ధరణి తరువాత రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది.

ఈ భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వీరికి సముచిత స్థానం కల్పిస్తాం.

మాన్యువల్ రికార్డుల భద్రత:
రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తాం.


*భూ-భారతి ప్రత్యేకతలు*
• ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదిస్తున్నాం.
• 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం.
• డిస్‌ప్లే : గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేస్తున్నాం.
• ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం.
• భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.
• గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేస్తాం.
• 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తాం.
• ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం.
======

• మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ : గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తాం.
• గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు : రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు నేను, సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటాం.
• త్వరలో ఒకే చట్టం : గత ప్రభుత్వం మాటలతో మభ్య పెట్టింది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
• ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్వోఆర్ చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారు. పూర్తి అవినీతితో నిండిపోయిన ఈ చట్టం మూడేండ్లకే నూరేండ్లు నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారు.
• అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకొస్తున్న భూ-భారతి చట్టం కనీసం వందేళ్ళు వర్ధిల్లుతుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment