హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/డిసెంబర్ 15: దేశంలోని అన్ని రైతు సంఘాలు ఏకతాటిపైకి వస్తే తప్ప, సమస్యలు పరిష్కారం కాదని ఎస్కేఎం నేత రాకేశ్ తికాయత్ అన్నారు. రైతు సంఘాలను విచ్ఛిన్నం చేయడమే కేంద్ర ప్రభుత్వ విధానమని ధ్వజమెత్తారు. అన్ని సంఘాలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంఎస్పీ చట్టం కోసం పోరాటానికి అన్ని సంఘాలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. ఎంఎస్పీ చట్టం డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రైతు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఖనౌరీ సరిహద్దు వద్ద తికాయత్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ”దల్లెవాల్ తన ఆమరణ నిరాహార దీక్షను వెనక్కి తీసుకుంటాడని నేను అనుకోను.
ఎంఎస్పీ చట్టం డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం అంగీకరించే వరకు ఆందోళ కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యం పట్ల మేమంతా ఆందోళన చెందుతున్నాం. రైతులు ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే ప్రభుత్వంతో పెద్ద పోరాటానికి నాయకత్వం వహించగలం” అని ఆయన అన్నారు. ‘ఖతాలు’ (హత్యలు)పై ఏర్పడిన ప్రభుత్వాన్ని త్యాగాలతో కదిలించలేమని అన్నారు. ”సిక్కు సమాజం త్యాగాల ఉదాహరణలతో నిండి ఉంది. వారు న్యాయమైన కారణాల కోసం తమ ప్రాణాలను అర్పించడానికి భయపడరు” అని అన్నారు, నరేంద్ర మోడీ నేతృ త్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొని కనీసం రైతులతో చర్చలు ప్రారంభించాలని అన్నారు.
క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్, భజరంగ్ పూనియా దల్లేవాల్‌కు మద్దతుగా నిలిచారు. ఖానౌరీ సరిహద్దుకు చేరుకోలేకపోయిన క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్, శంభు మోర్చాకు మద్దతు ఇస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రెజ్లర్, ఒలింపియన్ భజరంగ్ పునియా కూడా ఢిల్లీ చలో మోర్చాకు మద్దతు ప్రకటించారు. ఎంఎస్పీ చట్టం కోసం రైతులు చేస్తున్న నిరసనకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని పునియా ప్రజలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. దల్లేవాల్ తన ఆమరణ నిరాహార దీక్షను నవంబర్ 26న ప్రారంభించారు. నేటీకి 19వ రోజుకు చేరుకుంది.
16న ట్రాక్టర్ ర్యాలీ, 18న రైల్ రోకో పోలీసుల జులుంలో గాయపడ్డ రైతులకు సరైన చికిత్స కూడా అందించడం లేదని, వారికి సరైన చికిత్స అందేలా చూడాలని తాము పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని సర్వాన్ సింగ్ చెప్పారు. అదేవిధంగా తమ భవిష్యత్ కార్యాచరణను కూడా సింగ్ వెల్లడించారు. 16న పంజాబ్ బయట ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 18న రైల్ రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు. రైల్ రోకోలో పంజాబీ రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని సర్వాన్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలు తమపాత్రను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు మద్దతుగా కేవలం ప్రకటనలతో సరిపెట్టుకోవద్దని హితవు పలికారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని కోరారు. ఇతర అంశాలపై పార్లమెంట్‌ను స్తంభింపజేసినట్టే రైతు సమస్యలపై కూడా పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు.