రాజ్యాంగ పరిరక్షణ ఆలోచనతోనే ‘ఇండియా’ బ్లాక్‌
నేరానికి పాల్పడిన వారు వీధుల్లో..

Get real time updates directly on you device, subscribe now.

మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది

– ప్రపంచానికి స్ఫూర్తిదాయకం
– అందుకే..భారత్‌ను ప్రజాస్వామ్య మాతగా పిలుస్తున్నారు
– లోక్‌సభలో ప్రధాని మోడీ
– రాజ్యాంగంపై కేంద్రం దాడి చేస్తోంది
– దేశంపై మనుస్మృతిని రుద్దాలని చూస్తోంది
– మోడీ సర్కారుపై రాహుల్‌ విమర్శలు
– అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణల యుద్ధం
– ‘రాజ్యాంగం’పై వాడి వేడిగా చర్చ

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/డిసెంబర్ 14 : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ వాడి వేడిగా సాగింది. కేంద్రం, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టిన విషయం విధితమే. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని మోడీ చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”భారతదేశ గతమెంతో ఘనమైనది. 75 ఏండ్ల రాజ్యాంగ యాత్ర ఒక గొప్ప ప్రయాణం. రాజ్యాంగ నిర్మాతల దీర్ఘకాలిక దృక్పథం, సహకారంతో మనం ముందుకు సాగుతున్నాం.

ఇది సంబురాలు జరుపుకోవాల్సిన క్షణం. 1950లోనే భారతదేశం ప్రజాస్వామ్యం దేశం అవుతుందని నమ్మలేదు. దేశ ప్రజాస్వామ్యం, దేశ గణతంత్రం చాలా గొప్పది. మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అందుకే భారత్‌ను ఇప్పుడు ప్రజాస్వామ్య మాతగా పిలుస్తున్నారు. సవాళ్లను అధిగమించి భారత రాజ్యాంగం మనలను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర షోషిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం.

బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు విష బీజాలు నాటారు. పేదలకు ఇబ్బంది లేకుండా ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’ తెచ్చాం” అని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని చెప్పారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలన్నారు. రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉన్నదని చెప్పారు. దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చాలని అన్నారు.

కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు..
రాజ్యాంగంపై చర్చను కూడా మోడీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలకు ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిసారీ రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనపరుస్తూ వచ్చిందని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేస్తూ, అసమ్మతిని అణిచి వేసేందుకు రాజ్యాంగ సవరణలు తెచ్చిందన్నారు. ”1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) విధించారు. యావద్దేశాన్ని ఒక జైలుగా మార్చారు. రాజ్యాంగ హక్కులను ఊడలాక్కున్నారు. మీడియాను నోరెత్తనీయలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం అణిచివేతకు గురైంది. కాంగ్రెస్‌ పార్టీపై పడిన ఈ మరక ఎప్పటి తొలగిపోదు” అని తెలిపారు.

ప్రజలకు మేం అభయమిస్తే…మీరు వారి బొటనవేళ్లను నరుకుతున్నారు : రాహుల్‌ గాంధీ
ప్రజలకు మేం అభయమిస్తుంటే, మీరు వారి బొటనవేళ్లను నరుకుతున్నారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్రంపై ఆయన విమర్శలు సంధించారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని చెప్పారు. ఏకలవ్యుని బొటనవేలు తీసుకుని ద్రోణుడు అతడిని విలువిద్యకు దూరం చేసినట్టే.. ప్రభుత్వం ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తోందని విమర్శించారు. ”సైన్యంలోకి అగ్నివీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడే మీరు దేశ యువత బొటనవేళ్లను నరికేశారు. ఏకంగా 70 పరీక్షల పేపర్‌ లీకేజీలు జరిగినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను తెగగొట్టారు.

అదానీకి ధారావి ప్రాజెక్టును అప్పగించినప్పుడు ఇక్కడి చిన్న, మధ్య తరహా వ్యాపారుల బొటనవేళ్లను కోసేశారు. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రక్షణ పరిశ్రమను అదానీకి అప్పగించినప్పుడు దేశంలో నిజాయితీగా పనిచేసే వ్యాపారుల వేళ్లు కత్తిరించారు. ఇప్పుడు కూడా మీరు ఢిల్లీ బయట దేశ రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు. లాఠీచార్జి చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? రైతులు మిమ్మల్ని కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కల్పించాలని కోరుతున్నారు. మీరు మాత్రం అదానీ, అంబానీలకు లాభాలు కట్టబెట్టి రైతుల బొటన వేళ్లను నరికేశారు” అని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మేం దేశ ప్రజలకు అభయముద్ర గురించి చెబుతున్నాం. భయం వద్దు, ధైర్యంగా ఉండాలంటూ అభయమిస్తున్నాం. మీరు మాత్రం వారి బొటన వేళ్లను నరికేస్తాం అంటున్నారు. మీకూ, మాకు ఉన్న తేడా అదే” అని ఆయన అన్నారు.

‘ఆధునిక భారతావనికి రాజ్యాంగం ఒక డాక్యుమెంట్‌’ రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు. రాజ్యంగానికి, మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్‌ విశ్వసించారనీ, మనుస్మృతి రాజ్యాంగానికి అతీతమైనదని తన రచనల్లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారని చెప్పారు. ”సావర్కర్‌ రాజ్యాంగాన్ని విమర్శిస్తే, మీరు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. మీ నాయకుడి మాటలను మీరు సపోర్ట్‌ చేస్తారా?” అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమనీ, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలు రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు.

రాజ్యాంగ పరిరక్షణ ఆలోచనతోనే ‘ఇండియా’ బ్లాక్‌
నేరానికి పాల్పడిన వారు వీధుల్లో తిరుగుతుంటే, బాధితురాలిది మాత్రం ఇంట్లోంచి కదల్లేని పరిస్థితి అని రాహుల్‌ అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోందని, కానీ బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉన్నదని ఆరోపించారు. కలిసికట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఆలోచనతోనే ‘ఇండియా’ బ్లాక్‌ ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం రాజకీయ సమానత్వం లేదనీ, దేశంలోని సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారనీ, సామాజిక సమానత్వం లేదని, ఆర్థిక సమానత్వం అంతకంటే లేదని రాహుల్‌ విమర్శించారు. ఆ కారణంగానే కులగణనతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తద్వారా కొత్త తరహాలో రాజకీయాలు జరగనున్నాయనీ, 50 శాతం రిజర్వేషన్‌ గోడలు బద్ధలుకొడతామని స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment