హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 12:
తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది. మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఎంతైన ఖర్చు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల కోసం మరో సరికొత్త స్కీమును ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై ఫోకస్ పెట్టింది.
ఓ వైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త స్కీము రూపకల్పనపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆశాఖ ఉన్నతాధికారులను ఈమధ్యే కలిసింది. కాగా ఆటోల కొనుగోలుకు అయ్యే ఖర్చులో సగం ప్రభుత్వమే భరించనుంది.
ఈ మేరకు సర్కార్ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.ఈ విషయం సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లగా సానుకూలంగా స్పందించారని సమాచారం. సాధారణంగానే ఆటో డ్రైవింగ్ కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు అరుదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరుగుతోంది.
మన రాష్ట్రంలో జహీరాబాద్ లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. డీజిల్, సీఎన్జీతో నడిచే ఆటోలతో పోల్చితే ఎలక్ట్రిక్ ఆటోలను నడపడం చాలా తేలిక అని అంటున్నారు నిపుణులు.
దీంతో ఆ కంపెనీ ఇప్పటికే కొంతమంది మహిళలకు కూకట్ పల్లిలో డ్రైవింగ్ నేర్పిస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ పథకం ప్రారంభించేందుకు స్త్రీ, సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.