నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ..
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/డిసెంబర్ 11: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు..
రాబోయే నాలుగున్నరేళ్లలో ఎలాంటి టార్గెట్ తో పని చేయాలన్న అంశంపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈరోజు (డిసెంబర్ 11) ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమైతుంది. తొలి రోజు రోజు ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సప్ గవర్నెన్స్, ప్రజల్లో సానుకూల దృక్పథం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
వ్యవసాయం, పశు సంవర్థక, ఉద్యానవనం, పౌర సరఫరాలు, అటవీ, జల వనరులు, పంచాయతీరాజ్ లాంటి శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు శాంతిభద్రతలపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక, రేపు (డిసెంబర్ 12) పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, విద్యుత్, మానవ వనరులు, రవాణా, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణం, వైద్యం, ఆరోగ్యం లాంటి రంగాలపై ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. అలాగే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. 2019-24 మధ్య వైపీసీ ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగింది.