చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగం..

Get real time updates directly on you device, subscribe now.

మానవ హక్కుల దినోత్సవం….సుద్దులేలా!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 10:
చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగం స్పష్టీకరిస్తున్నా, తమ సంబంధీకులు మరింత అధిక సమానులని, వారి ప్రయోజనాల పరిరక్షణ తమ కర్తవ్యమనీ పాలకులు భావించే పాడు కాలం దాపురించింది. కేంద్రంలోని బీజేపీ, సమాఖ్య భావనకే తూట్లు పొడుస్తోంది. నిన్న కాక మొన్న రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా బీజేపీయేతర పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి అధికారంలో ఉన్నాయని, అలాంటి చోట అభివృద్ధి ఉండదని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలారు. అదే సందర్భంలో కేంద్రంలో వారు అధికారంలో ఉన్నది అదే ప్రాంతీయ పార్టీలపై అన్న సంగతి కానీ, నిన్నటికి నిన్న మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సైతం అదే ప్రాంతీయ పార్టీలపై ఆధారపడిందన్న సంగతి అంత త్వరగా మర్చిపోతే ఎలా?

స్వతహాగా మీరో, లేదు మీ సంకీర్ణ పక్షాలో అధికారంలో ఉన్న చోట అభివృద్ధికి మీరు కేటాయించే నిధులు ఒకలా, ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయింపులు ఒకలా చేయడం మీ రెండు నాలుకల వైఖరికి నిదర్శనం. ‘ నేతి బీరకాయలో నెయ్యి చందంగా దేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తి ఉంది. రాష్ట్రాలకు అందించే నిధులు, హక్కులకు సంబంధించి విసుగు చెందిన అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘాటైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అనేకం. భారతదేశ సమైక్యతకు, దేశ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని రాజ్యాంగంలోని 256 – 263 వరకు ఉన్న అధికరణలు తెలుపుతున్నాయి.

మరోవైపు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్‌ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సంక్షేమ రాజ్యం అన్న రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించడంలో 2014 కంటే ముందు ఉన్న ప్రభుత్వాలు విఫలం అయ్యాయి’ అని అన్నారు. ఈయన సైతం 2014 కంటే ముందు వీరి పార్టీ అధికారం ఉందన్న విషయాన్ని మరిచి పోయారా? లేక కావాలనే విస్మరించారా? అసలు మోడీ అధికారంలోకి రాకముందు ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలే జరగలేదని ఆయన సెలవిచ్చారు. పేదల కడుపు కొట్టి పెద్దల భోషాణాలు నింపడమే పరమావధిగా చట్టాలు చేసే పెద్దలు సంక్షేమ రాజ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రైతుల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టే, కార్పొరేట్లకు మేలు చేసే చట్టాలకు రూపకల్పన చేసిందెవరు? ఇది సంక్షేమరాజ్యమన్న మౌలిక సూత్రాన్నే మరిచి, అదే దేశాభివృద్ధికి సంక్షేమాలే అడ్డు అని చెప్పిన పెద్దమనిషే నేడు వాటి అమలు గురించి ఆందోళన చెందుతూ మాట్లాడటంలో ఉద్దేశమేమిటి?

దేశంలో పాలక బూర్జువా పార్టీలన్నీ ఎన్నికలను పథకాల చుట్టూనే తిప్పుతున్నాయి. వాటి అమలే సంక్షేమం అన్న వాదాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ఒకరితో మరోకరు పోటీ పడుతున్నాయి. అందులోనూ బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి దేశంలో తాము అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని మీడియాలో తెగ ఊదరగొడుతున్నది. రెండో వైపున ఇదే కమలదళం సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేక వైఖరిని పెద్దఎత్తున ప్రదర్శిస్తున్నది. పన్నుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఉచితాల పేర ప్రజలకు పంచి పెట్టడం వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతున్నదని వారి విమర్శ. మరోవైపు కాషాయేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట సంక్షేమ పథకాల అమలు గురించి గొంతు చించుకుంటుంది.

ఎన్నికలలో సంక్షేమ పథకాల ప్రచారాన్ని నిషేధించాలని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో సైతం కేసు వేయించింది. అలాంటి పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న అమిత్‌షా సంక్షేమ రాజ్యం గురించి ఇలా సుద్దపూస మాటలు మాట్లాడటం ‘గురివింద తన నలుపెరుగదన్నట్టు…’గా ఉంది. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి తీరుతుంది. జీవితాంతం ఆకలి తీర్చే మార్గం చూపడమే నిజమైన అభివృద్ధి. కానీ బూర్జువా పాలకులు శాశ్వత పరిష్కారం వైపు కాకుండా తాయిలాలు పేరిట ఉపశమనాలు కల్పిస్తూ సంక్షేమం అని గొప్పగా చెప్పుకుంటున్నాయి. దీనికి ఏ బూర్జువా పార్టీ మినహాయింపు కాదు. అవన్నీ ఒక తానులో ముక్కలే. పదవులే పరమావధిగా, అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రజలకు ఉచిత వరాల జల్లులు కురిపిస్తాయి. అయితే ఇక్కడ కూడా కాషాయ దళం తన కుత్సితత్వాన్ని మరోసారి బయట పెట్టుకుంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ రంధ్రాన్వేషణ మొదలెట్టింది.

ఇలా బొక్కలు వెతకటంలో వారు సిద్ధహస్తులు. వాస్తవానికి గత పదేండ్ల బీజేపీ పాలనలో వారిచ్చిన ఒక్క హామీని కూడా అమలుచేసిన పాపాన పోలేదని గుర్తెరగాలి. నయా ఉదారవాద విధానాలు అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏలినవారి లీలావిన్యాసాలివి. ఎదుంటివారికి సుద్దులు చెబుతూ వారు మాత్రం కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం పాకులాడటం అంటే ఇదేమరి! తమ యజమానులైన కార్పొరేట్‌, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకోసం, అసాంఖ్యాకులైన పెదల నోటికాడి కూడూ లాగేసుకునే కుతంత్రాలివి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment