ఆకలిని చంపుకొని చదువుకున్నా : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ

Get real time updates directly on you device, subscribe now.

ఒడిశాలోని రమాదేవి వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఉద్వేగ భరిత ప్రసంగం…

హ్యూమన్ రైట్స్ టుడే/భువనేశ్వర్‌: నాలుగు దశాబ్దాల క్రితం రమాదేవి విశ్వవిద్యాలయంలో ఎలాంటి సౌకర్యాలూ లేవని, నిమ్మరసం తాగి, తోపుడు బండి వద్ద పావలా పెట్టి కొనుక్కున్న పల్లీలు తిని విద్యార్థులు ఆకలి తీర్చుకునేవారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో తాను విద్యనభ్యసించిన రమాదేవి వర్సిటీ(రాష్ట్రపతి చదివే రోజుల్లో కళాశాల ఇటీవల వర్సిటీ హోదా పొందింది) స్నాతకోత్సవంలో శుక్రవారం పాల్గొని ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. మయూర్‌భంజ్‌ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు నిమిత్తం భువనేశ్వర్‌ చేరుకున్న తాను పేదరికం వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు. వేరుశనక్కాయలు తినాలని ఉన్నా.. పావలా మిగులుతుందని ఆకలిని చంపుకొని గడిపిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయన్నారు. మహిళలు.. పురుషులతో సమానంగా ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం సంతోషకరమన్నారు. పార్లమెంటులో ప్రస్తుతం 115 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రతి రంగంలోనూ సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. వీరనారీమణులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ప్రసంగం అనంతరం ఇద్దరికి పీహెచ్‌డీ, 22 మందికి పసిడి పతకాలు అందజేశారు. అంతకుముందు జరిగిన మరో కార్యక్రమంలో దౌపదీ ముర్ము మాట్లాడుతూ.. తన జీవితం ఎత్తుపల్లాల సమ్మేళనమని, శారీరక, మానసిక రుగ్మతలకు లోనై చాలా బాధ పడ్డానని పేర్కొన్నారు. యోగా, ప్రాణాయామం, ఆధ్యాత్మిక పథంవైపు ప్రయాణం సాగించిన తరువాత వాటన్నింటినీ జయించానని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొంది, ఆత్మస్థైర్యంతో ఇక్కడి వరకు వచ్చానన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment