స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న యువత..

Get real time updates directly on you device, subscribe now.

అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు.!!

హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి/డిసెంబర్ 06 : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించింది.

సమగ్ర సర్వే నివేదిక రాగానే దాని ఆధారంగా ఓటర్ల జాబితాను కూడా రూపొందించి రిజర్వేషన్ల ప్రకటనకు సిద్ధం కావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో జాబితా తయారీకి శిక్షణ అందించేందుకు జిల్లాల నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్లను (మాస్టర్ ట్రైనర్లు)గా ఎంపిక చేసి హైదరాబాద్ కు పంపించాలని ఎస్ఈసీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీసీ గణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహిస్తారన్న కోణంలో ఆలోచించి మరో రెండు నెలల పాటు ఎలక్షన్స్ ఉండవనే అభిప్రాయంతో ఉన్న ఆశావహుల్లో కదలిక తీసుకువచ్చింది. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సందడి షురూ అయ్యింది. పోటీకి సై అంటున్న ఆశావహుల్లో సర్కారు నిర్ణయం ఆనందం కలిగిస్తుండగా.. పోటీ చేయాలనుకునే నేతలు తమ మద్దతుదారులతో సమాలోచనలు ప్రారంభించారు.

ఆసక్తి కనబరుస్తున్న యువత..

సర్పంచుల పదవీకాలం పూర్తయి సంవత్సరం కావస్తుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవి కాలం కూడా నాలుగు నెలల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో ఆశావహులు ప్రజలను ఇప్పటి నుంచే మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గతంలో ఉన్న రిజర్వేషన్ మారితే ఎవరు పోటీ చేయాలని ? మారక పోతే ఎవరు బరిలో ఉంటారు ? అనే విషయాల పై గ్రామాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన తాజా, మాజీలు, కొత్త వ్యక్తులు సర్పంచ్, ఎంపీటీసీల కొరకు పోటీ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ..

చేసేందుకు యువకులు అధిక సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కొక్క పార్టీ నుండి ముగ్గురు లేదా నలుగురు పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎన్నికల్లో అయ్యే ఖర్చును సైతం ఇప్పటికే సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అధికార పార్టీకి చెందిన ఆశావహులు ఎంత ఖర్చుకైనా వెనకడుగు వేసేది లేదని చెబుతున్నారు. గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని పంచాయతీల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది.

పెరగనున్న బీసీ రిజర్వేషన్లు…

స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచడం కోసం సమగ్ర సర్వే చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రిజర్వేషన్లు పరిశీలిస్తే పదిహేను శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు, 24 శాతం బీసీలకు అమలవుతున్నాయి. ఇక కులాల వారీగా తమకు అధికంగా ఓట్లు ఉన్నందున తమకే అవకాశం ఇవ్వాలని కొందరు, పార్టీలో ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశామని మరి కొందరు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల వద్ద ఆశావహులు చెబుతూ బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

సమగ్ర సర్వే ఆధారంగా ఓటర్ల జాబితా..

రాష్ట్రంలో ఇటీవల సమగ్ర సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఓటరు జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పుడున్న రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా గ్రామ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ సైతం ఆ లోపు చేపట్టాలని సూచించారు. ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామాల్లో ఓటరు జాబితాలను ప్రకటించి వార్డుల వారీగా సిద్ధం చేయనున్నారు. పంచాయతీ ఓటర్లు 650 లోపు ఉన్నట్లయితే ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. 200 మందికి రెండు, 400 మందికి మూడు, 400 – 650 మందికి నాలుగు, 650 కి మించితే మరో అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా గతంతో పోల్చితే వార్డు స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment