డిసెంబర్ 6 న మహా పరి నిర్వాణం..
అందరివారు అంబేద్కర్
నేడు అంబేద్కర్ వర్థంతి
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ డిసెంబర్ 06: భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన గొప్ప విద్యావేత్త, జాతీయవాది, మేధావి, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్. 14 ఏప్రిల్ 1891న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ఉన్న ‘మౌ’ గ్రామంలో జన్మించారు. తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ మిలిటరీ ఉద్యోగి. తల్లి భీమాబాయ్. వీరి స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబావాడే గ్రామం. ఈ దంపతులకు కలిగిన 14 మంది సంతానంలో చిన్నవాడు అంబేద్కర్.
♦️వారి అభివృద్ధి కోసం కృషి చేస్తూ..
అంబేద్కర్ కడు దుర్భర పేదరికంలో పెరిగారు. దీపం వెలుతురులో చదువుకున్నారు. 17 సంవత్సరాల వయసులో రమాబాయితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా బరోడా రాజు అందించిన 25 రూపాయల స్కాలర్‌షిప్‌తో చదువుకుని 1912లో బీఏ మొదటి ర్యాంకుతో పాసయ్యారు. తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో బరోడా సంస్థానంలోనే రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే తండ్రి మరణించడంతో కుటుంబ భారం మీద పడింది. అయినా చదువుకోవాలనే ఆశయంతో మరోసారి బరోడా రాజును అభ్యర్థించగా, చదువు పూర్తయ్యాక తన సంస్థానంలో పదేళ్లపాటు ఉద్యోగం చేయాలనే ఒప్పందంతో అమెరికాకు పంపారు. అంబేద్కర్ అక్కడ న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతి శాస్త్రంలో చేరారు.
అక్కడి నుంచే ‘భారతదేశ జాతీయ ఆదాయం-చారిత్రక విశ్లేషణాత్మక అధ్యయనం’ అనే అంశం మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. అనంతరం ‘ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’ అనే అంశంపై పరిశోధన చేసి 1923 లో డాక్టరేట్ పొందారు. లండన్ కు వెళ్లి లా పూర్తి చేసుకున్నారు. అదే యేడు స్వదేశానికి తిరిగొచ్చి బొంబాయిలో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. స్వాతంత్ర్య ఉద్యమకారుల తరపున, అంటరానివారి తరపున, జమీందారీల రద్దు కోసం, భూ సంస్కరణల వంటి ఎన్నో ప్రముఖ కేసులను వాదించి గెలిచారు. కోర్టులో బ్రిటిష్ పరిపాలనను తరచూ విమర్శించేవారు. నిమ్న జాతుల అభివృద్ధికి స్కూల్స్, కాలేజీలు, గ్రంథాలయాలు స్టాపించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పరిశ్రమలలో, వ్యవసాయంలో సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడడం తదితరాలకు కృషి చేశారు. అంబేద్కర్ కృషి ఫలితంగా 1920లో ‘అఖిల భారత నిమ్న జాతుల సభ’ జరిగింది. అందులో అంబేద్కర్ ఉపన్యాసాన్ని విన్న కొల్హపూర్ రాజు ఆయనను ‘నిమ్న జాతుల బానిస సంకెళ్లు బద్దలు కొట్టే అపూర్వ శక్తి’ అని అభినందించారు.
♦️రాజకీయ పార్టీని స్థాపించి..
న్యాయవాదిగా ఉంటూనే ట్యుటోరియల్‌లో బిజినెస్ పాఠాలను బోధించేవారు అంబేద్కర్. వెనుకబడిన కులాలవారి 18 రకాల సమస్యలను సైమన్ కమిషన్ కు తెలియజేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రతినిధిగా వ్యవహరించారు. దేశ రాజ్యాంగ రూపకల్పన చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని (indipendent labour party) ఏర్పరిచి 1937లో జరిగిన ఎన్నికలలో 17 స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకున్నారు. 1947 ఆగస్టు 3న స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా (first law minister) నియమితులయ్యారు. మహిళలు అత్యున్నత బాధ్యతలు చేపట్టాలని ఎన్నో చట్టాలను రూపొందించారు. వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ప్రతి మనిషి స్వతంత్రంగా తన ప్రాథమిక హక్కులను (fundamental rights) పొందాలని ఎన్నో చట్టాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ (Bhimrao Ramji Ambedkar) అధ్యక్షతన 1947 ఆగస్టు 27న రాజ్యాంగ రచన సంఘం ఏర్పాటు చేశారు.
రాజ్యాంగ ముసాయిదా తయారీ కీలక పాత్ర పోషించారు. హిందూ కోడ్ బిల్‌పై పార్లమెంట్ ఆమోదం తెలపకపోవడంతో అసంతృప్తి చెంది రాజీనామా చేశారు. 1956 సెప్టెంబర్ 3న బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 14 విజయదశమిన సుమారు రెండు లక్షల మంది అనుచరులతో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించి డిసెంబర్ 6 న మహా పరి నిర్వాణం చెందారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ బిరుదును ప్రదానం చేసింది. ఆయన వెళ్లిపోయి 60 సంవత్సరాలు గడిచినా మనందరికీ స్పూర్తిగా, మార్గదర్శిగా నిలిచారు.