హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 06:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు వచ్చే ఏడాది మార్చి1 న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంటర్మీడియట్ విద్య మండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది.
ఇంటర్ వార్షిక పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇంటర్ బోర్డు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణ ఆదిత్య ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 428 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇంటర్ విద్యాశాఖ జిల్లా, నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్, సీనియర్ ఇంటర్‌లకు కలిపి మొత్తం 1.80 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే, రాష్ట్రంలోని పలు కాలేజీల్లో విద్యార్ధుల హాజరు సగం మందికి కూడా మించిలేదు.
ఈ క్రమంలో గత మూడేళ్ల గణాంకాలను కృష్ణ ఆదిత్య పరిశీలించారు. 2023లో ఫస్టియర్‌లో 40 శాతం మంది విద్యార్ధులు మాత్రమే పాసైనట్లు గుర్తించారు. దీంతో ఈ ఏడాది ఇంటర్ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు గైర్హాజరవుతున్న విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు.
రెండు, మూడుసార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని సూచించారు. చదువులో ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలని, వెనకబడిన వారిని గుర్తించి, ఎన్ని ప్రత్యేక తరగతులు తీసుకుంటే మిగిలిన విద్యార్థులతో సమానంగా తయారవుతారో అంచనా వేయాలని సూచించారు. డిసెంబరు నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయాలి. ఈ మేరకు లెక్చరర్లు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు.