మహిళా సాధికారత కోసం తెలంగాణలో..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ డిసెంబర్ 06: తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.

🔸స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్  ప్రారంభించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభించిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🔸ఆయా సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ స్వయం సహాయక మహిళ సంఘాలు ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని అభినందించారు.

🔸సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల్లో కోటి మందిని చేర్పించే బాధ్యత మీది. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వానిది అని మహిళా సంఘాలను ఉద్దేశించి అన్నారు.

🔸ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్ వంటి మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించిన ముఖ్యమంత్రి కోటి మందిని కోటీశ్వరులను చేసే లక్ష్య సాధనలో భాగంగా త్వరలోనే ఉమ్మడి జిల్లాల వారిగా సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 9 న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్బంగా మహిళా సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు.

🔸సతీమణి సుధా దేవ్ వర్మతో కలిసి కార్యక్రమానికి హాజరైన గవర్నర్ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను ప్రదర్శించాలని, తెలంగాణ హాండ్లూమ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment