ప్రజాస్వామ్య విజయం..

Get real time updates directly on you device, subscribe now.

సాధికారతకు సమాచార హక్కు!
             – శ్రీనివాస్‌ మాధవ్
    సమాచార హక్కు ఉద్యమకారులు
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/డిసెంబర్ 03:
దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంలో అరుణా రాయ్‌ వంటి మహిళా ఉద్యమకారులెందరో కీలక పాత్ర పోషించారు. కానీ, ఈ హక్కును వినియోగించుకుంటున్న మహిళలు తక్కువే. సమాచార హక్కును మరింతగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్త్రీలు సమానత్వం, సాధికారత సాధించగలుగుతారు.

కొన్ని సమాచార కమిషన్ల వార్షిక నివేదికల్లో దరఖాస్తుదారుల సంఖ్యను వెల్లడిస్తున్నారు. కానీ, వారిలో మహిళలు ఎందరనేది చెప్పడంలేదు. కేంద్ర సమాచార హక్కు ఆన్‌లైన్‌ పోర్టల్‌ మాత్రం ఈ గణాంకాలను సేకరిస్తోంది. ఆ ప్రకారం, 2017-23 మధ్యకాలంలో సుమారు 23లక్షల మంది ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం అడిగారు. అయితే, వారిలో మహిళలు కేవలం 18శాతమే. దేశంలో స్త్రీ-పురుషుల మధ్య అనేక అసమానతలు ఉన్నాయి. ‘గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌-2024’లోని 146 దేశాల్లో ఇండియాది 129వ స్థానం. ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో స్త్రీ-పురుష సమానత్వ సాధనకు భారత్‌ ఎంతగానో కృషి చేయాల్సి ఉంది. ఇందులో అత్యంత ప్రధానమైనది- సమాచార హక్కును శక్తిమంతం చేయడం.

మహిళలకు సదుపాయం
మహిళల ఆర్థిక సాధికారతకు విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం కీలకం. ఉదాహరణకు ‘మాతృత్వ పెనాల్టీ’ శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గడానికి దారితీస్తోంది. మెటర్నిటీ బెనిఫిట్‌ సవరణ చట్టం-2017 ప్రకారం… ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులకు 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొందే హక్కు ఉంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోకన్నా ఇది ఎక్కువ ప్రయోజనకరమని ప్రధానమంత్రి తన విదేశీ పర్యటనల్లో సగర్వంగా చెబుతుంటారు.

కానీ, ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళలకు ఈ సదుపాయం గురించి అంతగా తెలియడంలేదు. గర్భవతులను ఉద్యోగం నుంచి తొలగించే సంస్థలెన్నో! ప్రభుత్వ విభాగాల్లోని ఒప్పంద ఉద్యోగులకూ ఈ హక్కు గురించి సమాచారం అందడంలేదు. మెటర్నిటీ బెనిఫిట్‌ చట్టంలోని సెక్షన్‌-19 ప్రకారం అన్ని కార్యాలయాలు ఈ హక్కుకు సంబంధించిన సమాచారాన్ని నోటీసు బోర్డులో విధిగా ప్రదర్శించాలి.

మహిళలు గర్భస్రావ వైద్యసేవలు పొందడమనేది ‘జీవించే హక్కు’లో భాగమని సుప్రీంకోర్టు లోగడ స్పష్టీకరించింది. 2022లో అమెరికా సుప్రీంకోర్టు ‘డాబ్స్‌ వర్సెస్‌ జాక్సన్‌ విమెన్స్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కేసు’ విచారణ సందర్భంగా తమ రాజ్యాంగంలో గర్భస్రావ హక్కు లేదని వ్యాఖ్యానించింది. ఆ తరవాత మూడు నెలల్లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం ‘ఎక్స్‌ వర్సెస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ(దిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ)’ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ‘‘తన శరీరం గురించి నిర్ణయం తీసుకునే స్వాతంత్య్రం మహిళకే ఉంటుంది. ఇందుకు భర్త, ఇతర బంధువుల అనుమతి అవసరం లేదు.

అవివాహితకూ, ఒంటరి మహిళకూ 24 వారాల వరకు గర్భస్రావ హక్కు ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. గర్భస్రావ వైద్యసేవలు పొందే హక్కు గురించి తెలియక ఎంతోమంది పేద మహిళలు నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రజాస్వామ్య విజయం
గ్రామ స్వరాజ్యానికి గ్రామసభ ఎంతో కీలకం. తమ పంచాయతీ పరిధిలో చేపట్టే పనులకు సంబంధించిన ప్రణాళికలు, అంచనాలు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి తెలుసుకోవడం సభ్యుల హక్కు. గ్రామసభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. బాలలు, మహిళల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఏ ఊరైనా ‘మహిళా స్నేహపూర్వక గ్రామం’గా గుర్తింపు పొందాలంటే, అక్కడి స్త్రీలకు సమాచారాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉండాలి.

కాబట్టి గ్రామసభల్లో పాల్గొనేలా, సమాచార హక్కును ఉపయోగించుకునేలా మహిళలను ప్రోత్సహించాలి. గ్రామసభకు ఎక్కువమంది స్త్రీలు హాజరైతే మహిళా సర్పంచులు క్రియాశీలంగా మారతారు. వారిలో సామర్థ్యం, పట్టుదల ఉన్నవారికి నాయకత్వ శిక్షణ ఇస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలుగానూ రాణించగలుగుతారు. 2029 నాటికి ‘నారీశక్తి వందన్‌ చట్టం’ అమలైతే తెలుగు రాష్ట్రాల శాసనసభల్లోనూ పెద్దసంఖ్యలో మహిళా ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఇలాంటివారు పాలనానుభావం కలిగిన గ్రామీణ మహిళల్లోంచి వస్తే, అది ప్రజాస్వామ్య విజయమే అవుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment